ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం సింగనమల(Singanamala). ఈ నియోజకవర్గంలో వైసీపీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు పెరుగుతోంది. టికెట్ విషయంలో వివాదాలు తీవ్ర స్థాయిలో సాగుతున్నాయి. 2019 ఎన్నికల్లో సింగనమల నుంచి జొన్నలగడ్డ పద్మావతి విజయం సాధించారు. ఆమె భర్త ఆలూరి సాంబశివరెడ్డి తెరవెనుక చక్రం తిప్పారనే వాదన ఉంది. అయితే 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఇక్కడ పరిస్థితి మారిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ జొన్నలగడ్డ పద్మావతికి జగన్ టికెట్ ఇవ్వలేదు.
ఈ క్రమంలోనే సాధారణ డ్రైవర్ అయినా వీరాంజనేయులుకి జగన్ టికెట్ ఇచ్చారు. కానీ కూటమి ప్రభావం నేపథ్యంలో వీరాంజనేయులు భారీ ఓటమిని చవిచూశారు. ఇక వచ్చే ఎన్నికల నాటికి అయినా తమకు టికెట్టు దక్కుతుందని జొన్నలగడ్డ పద్మావతి ఆమె భర్త సాంబశివరెడ్డి ఆశలు పెట్టుకున్నారు. కానీ చిత్రం ఏంటంటే అప్పటివరకు కాంగ్రెస్‌లో ఉన్న సీనియర్ నాయకుడు శైలజనాథ్(Sake Sailajanath) వైసీపీలోకి వచ్చారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి సింగనమల టికెట్ను శైలజనాద్‌కే ఇస్తారని ఆయన వర్గం ప్రచారం చేస్తోంది.

మరోవైపు పద్మావతి మాత్రం వచ్చే ఎన్నికల్లో తనకు కచ్చితంగా జగన్ టికెట్ ఇస్తారని భావిస్తున్నారు. దీంతో ఇటు శైలజనాథ్ అటు పద్మావతి వర్గాల మధ్య వైసీపీలో ఆసక్తికర రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇరుపక్షలు వేరువేరుగా కార్యక్రమాల నిర్వహిస్తున్నాయి. ఎవరికి వారుగా జగన్(Jagan) ఫోటోలు పట్టుకుని తిరుగుతున్నారు. నిజానికి ఎన్నికలు జరగడానికి రెండున్నరేళ్ళ సమయం ఉంది. అయినప్పటికీ.. ఇప్పటినుంచి సింగనమల రాజకీయాలు తీవ్ర స్థాయిలో వేడెక్కాయి.
ఒకరిపై ఒకరు అధిపత్య పోరును ప్రదర్శించుకుంటున్నారు. వరుస విజయాలు సాధించిన సాకే శైలజానాథ్‌కు ప్రజల్లో సానుకూలత ఉంది. అదే సమయంలో బలమైన కాంగ్రెస్(Congress) అనుకూల వర్గాలు కూడా ఆయన వెనుక ఉన్నాయన్నది వాస్తవం. దీంతో కచ్చితంగా తనకే టికెట్ దక్కుతుందని శైలజానాథ్ ఆశ పెట్టుకున్నారు. ఇక మహిళల కోటాలో ఈ సీటు కీలకంగా ఉందని, కాబట్టి తనకే దక్కుతుందని పద్మావతి చెబుతున్నారు. ఫలితంగా ఈ ఇద్దరు వర్గాల మధ్య టికెట్ విషయంలో అంతర్గత పోరు కొనసాగుతోంది.

అయితే అధిష్టానం ఈ సీటు విషయంపై ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. శైలజాకు ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ టికెట్ విషయంలో మహిళ నేతను పక్కన పెడతారా అనేది చర్చ. ఒకవేళ ఇదే జరిగితే ఎస్సీ సామాజిక వర్గంలో మహిళను అవమానించాలన్న వాదన బలపడే అవకాశం ఉంది. ప్రత్యర్ధులకు అవకాశం ఇచ్చినట్టుగా కూడా భావించాల్సి ఉంటుందని వైసీపీ(YCP) లోని ఒక వర్గం చెబుతోంది. మరోవైపు శైలజానాద్ వంటి సీనియర్ను పార్టీలోకి తీసుకొని ఆయనకు టికెట్ లేకుండా చేస్తే అది కూడా వైసీపీకి ఇబ్బందికర పరిణామంగా మారే అవకాశం ఉంటుంది. దీంతో ఈ ఇద్దరి వివాదం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది చూడాలి.