ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం పెనమలూరు. ఈ నియోజకవర్గంలో టిడిపి అనుకూల ఓటు బ్యాంకు భారీగా ఉంది. 2019లో తప్ప 2014, 2024 ఎన్నికల్లో వరుసగా ఇక్కడ టిడిపి విజయం సాధించింది. పెనమలూరు నియోజకవర్గ అంటేనే టిడిపికి కంచు కోటగా చెబుతారు. ఈ నియోజకవర్గ నుంచి బోడే ప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే 2019లో ఆయన ఓడిపోవడానికి ఏ కారణాలు అయితే పని చేశాయో ఏ కారణాల వల్ల ఆయన ఓటమి పాలయ్యారో వాటిని సరిదిద్దుకునే విషయంలో ఇప్పటికీ అవే తప్పటడుగులు వేస్తున్నారన్న వాదన టిడిపిలో వినిపిస్తోంది.
నాయకుల మధ్య కలివిడి లేకపోవడం, గ్రూపు రాజకీయాలు చేయడం వల్ల 2019 ఎన్నికల్లో పెనమలూరు నియోజకవర్గాన్ని టిడిపి కోల్పోయింది. వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా వైసిపి ప్రభావం కనిపించిన నేపథ్యంలో ఓడిపోయామని అప్పట్లో బోడె ప్రసాద్ సమర్ధించుకున్నప్పటికీ... ప్రస్తుతం కూడా అదే తరహా రాజకీయాలు కొనసాగుతున్నాయి. నాయకుల మధ్య కలివిడి అనేది కనిపించని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఎమ్మెల్యే కేవలం ఒక వర్గాన్ని మాత్రమే చేరదీస్తున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది.
దీంతో ఈ నియోజకవర్గంలో మళ్లీ 2019 నాటి పరిస్థితులే ఏర్పడే ప్రమాదం ఉందన్నది టిడిపి నేతలు చెబుతున్న మాట. సీనియర్లను కలుపుకొని వెళ్లడం లేదని అదే సమయంలో పార్టీ పరంగా కార్యక్రమాలు నిర్వహించే విషయంలో కూడా గ్రూపు రాజకీయాలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. ఇటీవల పార్టీ ఆవిర్భావ సమావేశం జరిగినప్పుడు మండలాల వారీగా నాయకులు విడిపోయారు. కానూరులో ఒక వర్గం టిడిపి కార్యక్రమాలు నిర్వహించగా పెనుమలూరులో మరో వర్గం కార్యక్రమాలు చేపట్టింది.
ఆయా కార్యక్రమంలో ఒకరిద్దరు నాయకులు ఎమ్మెల్యే వ్యవహార శైలిని తప్పుపట్టారు. ఇప్పటికీ తమకు పనులు కావడం లేదని, కనీసం తమతో సమావేశాలు కూడా నిర్వహించడం లేదని చెప్తున్నారు. ఈ తరహా పరిస్థితులు ఇలాగే కొనసాగితే మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి ఎమ్మెల్యే ఇబ్బందులు పడక తప్పదనేది పార్టీ వర్గాల మధ్య చర్చ నడుస్తోంది. దీనిని సరి చేసుకుంటారా లేకపోతే ఇదంతా వైసీపీ సృష్టిస్తున్న డ్రామా అని ఎదురు దాడి చేస్తారో చూడాలి.