ఏపీ రాజధానిగా అమరావతి ఎందుకు? ఎంచక్కా మావిగన్ పెట్టేస్తే పోలా? అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే పలువురు స్పందించటం తెలిసిందే. వీటన్నింటికి మించి.. తాజాగా జగన్ సోదరి.. ఒకప్పటి జగన్ విడిచిన బాణంగా చెప్పే షర్మిలమ్మ.. జగన్ ప్రతిపాదనపై స్పందించారు. ఇప్పటివరకు మావిగన్ కు పంచ్ వేసిన వారిలో షర్మిలకు సాటి వచ్చే వారే లేరని చెప్పాలి. ఎంతసేపు గన్నులు.. గొడ్డల్లేనా? అంటూ చురకలు అంటించిన ఆమె.. నిర్మించాలనే ఆలోచన ఉండి ఉంటే.. అధికారంలో ఉన్నప్పుడు చేసే వారు కదా? అన్న ప్రశ్నను సూటిగా సంధించారు.
ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు గాడిదలు కాశారా? అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడిన షర్మిల.. ‘‘ఐదేళ్లలో రాజధాని కోసం ఒక్క ఇటుక కూడా కట్టలేదు. అధికారంలో వచ్చిన వెంటనే ప్రజా వేదిక కూల్చారు. ఇప్పుడు అమరావతి వద్దు.. మావిగన్ ఏర్పాటు చేస్తారంట. అమరావతికి మావి గన్ అని మీ పేరు, పులివెందులకు అవినాష్ రెడ్డి పేరు మీద “ఆవి గొడ్డలి’’ అని పెడితే ఇంకా బాగుంటుంది’’ అంటూ మండిపడ్డారు.
అక్కడితో ఆగని షర్మిల(sharmila).. జగన్(jagan) తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘మావిగన్ అద్భుత ఐడియా అయితే.. ఐదేళ్ల అధికారంలో ఉండి గాడిదలు కాశారా? మావిగన్(mavigun) అద్భుతం అయితే అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అమలు చేయలేదు? మావిగన్‌కి తక్కువ ఖర్చు అయితే మూడు రాజధానులు ఎందుకు అన్నారు? ఐదేళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా? లేదంటే నిద్ర పోయారా?’’ అంటూ సూటిగా ప్రశ్నించారు.
మావిగన్ పై తన స్పందనను తెలియజేయాలని అడుగుతున్నారని.. ఎవరైనా ఈ జోక్ వింటే బిగ్గరగా నవ్వుతున్నారన్నారు. తమ నవ్వే మావిగన్ మీద తమకున్న అర్థంగా తేల్చేశారు. మళ్లీ కొత్తగా వైఖరి చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మావిగన్ జోక్ అంటే తనను కూటమికి దత్తపుత్రికగా వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ నేతలపై సీరియస్ అయ్యారు. ‘పచ్చకామెర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగా ఉంటుంది. వైసీపీ నేతల తీరుపై ఇలానే ఉంటుంది. జగన్ మాత్రమే బీజేపీకి దత్తపుత్రుడు. అందుకే మోదీతో ఆయన అక్రమ పొత్తు పెట్టుకున్నారు. బీజేపీతో బహిరంగ పొత్తు పెట్టుకొనే దమ్ము జగన్‌కి లేదు.ఎందుకంటే బహిరంగ పొత్తుకు జగన్ ఓటు బ్యాంక్ అనుమతి ఇవ్వదు’ అని వివరించారు.
మోడీ దత్తపుత్రుడిగా ఇన్నేళ్లు అన్ని బిల్లులకు జగన్ మద్దతు ఇచ్చారన్న షర్మిల.. కాలర్ పట్టుకొని అడుగుతా? అని ప్రధాని మోడీకి దత్తపుత్రుడు అయ్యాడన్నారు. మోడీ దత్తపుత్రుడిగా ఇన్నేళ్లు అన్ని బిల్లులకు జగన్ మద్దతు ఇచ్చిన వైనాన్ని షర్మిల గుర్తు చేశారు. ‘‘బీజేపీతో వీళ్ళు అక్రమ పొత్తు పెట్టుకున్నారు కాబట్టి.. తాము కూడా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది’’ అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అందరికికౌంటర్లు ఇచ్చే వైసీపీ నేతలు.. షర్మిల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.