ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణను తిప్పిన స్టేషన్ తిప్పకుండా తిప్పుతానంటూ వైసీపీ అధినేత జగన్(jagan) చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాధాకృష్ణపై కేసులు పెడతామంటూ జగన్ పరోక్షంగా చేసిన కామెంట్లు రాజకీయ కాక రేపాయి. ఈ క్రమంలోనే ఆర్కేపై జగన్ చేసిన కామెంట్లపై ఏపీ వ్యవసాయ శాఖా మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు(achennaidu) ఘాటుగా స్పందించారు.
అవినీతి డబ్బుతో జగన్‌లా తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని వేమూరి రాధాకృష్ణ పత్రిక పెట్టుకోలేదని విమర్శించారు. ఆడవాళ్ల గురించి మాట్లాడే హక్కు జగన్‌కు లేదని అన్నారు. పత్రిక గురించి మాట్లాడే జగన్...ఆయన భార్య కూడా పత్రికా అధిపతే అన్న విషయం గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. రాధాకృష్ణ జర్నలిస్టుగా పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి పత్రిక పెట్టుకున్నారని అన్నారు. ప్రజలను చైతన్య పరచడానికి, ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు రాధాకృష్ణ మాట్లాడారని అన్నారు.
రాధాకృష్ణ వ్యాఖ్యలపై సమాధానం చెప్పలేకుంటే కోర్టులను ఆశ్రయించాలని సూచించారు. సాక్షి న్యూస్ లో అమరావతి మహిళలను వ్యభిచారులతో పోల్చారని, నారా భువనేశ్వరి గురించి అసెంబ్లీలో అసభ్యకరంగా విమర్శించారని, అప్పుడు జగన్ దుర్యోధనుడిలా చూస్తూ కూర్చున్నారని మండిపడ్డారు. టీడీపీతో పాటు అమరావతి మహిళలను మాటలతో వైసీపీ నేతలు వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్ఆర్ చనిపోయిన రోజు జగన్ ఎక్కడున్నారని అచ్చెన్న ప్రశ్నించారు. రాష్ట్రమంతా వైఎస్ కనిపించడం లేదని ఆందోళన చెందుతుంటే, జగన్ ఇతర రాష్ట్రాల్లో ఉండాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. వైఎస్ఆర్ మరణవార్త విని తెలుగు ప్రజలంతా శోకసంద్రంలో మునిగిపోతే, జగన్ సీఎం పదవి కోసం సంతకాలు సేకరించారని విమర్శించారు.
వైఎస్ఆర్ మృతి వెనుక జగన్ హస్తం ఉందనే అనుమానాన్ని గతంలో బొత్స సత్యనారాయణ వ్యక్తం చేశారని గుర్తు చేశారు.