ఆ అభ్యర్థి ఆస్తుల విలువ తెలిస్తే షాకే!

admin
Published by Admin — April 08, 2026 in National
News Image

ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర అంశం ఒకటి తెర మీదకు వచ్చింది. తమిళనాడులోని తిరుచ్చి జిల్లా లాల్గుడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న అన్నాడీఎంకే అభ్యర్థి లీమారోస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. ఈ మహిళా అభ్యర్థి ఆస్తుల లెక్క తెలిస్తే నోటి వెంట మాట రాదంతే. అంతేకాదు.. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత సంపన్న అభ్యర్థిగా ఆమె నిలుస్తారని చెబుతున్నారు. ఇంతకూ ఆమె ఆస్తుల లెక్క చెప్పలేదు కదా? అక్కడికే వస్తున్నాం. ఆమె దాఖలు చేసిన తన నామినేషన్ లో పేర్కొన్న ఆస్తుల ప్రకారం.. అధికారికంగా ఆస్తుల విలువ రూ.1049 కోట్లుగా పేర్కొన్నారు.

ఇంతకూ ఆమె ఎవరు? ఆమెకు అన్ని ఆస్తులు వచ్చాయి సరే.. ఆమె చేసే వ్యాపారాలేంటి? అన్న వివరాల్లోకి వెళితే.. లాటరీ టికెట్ల విక్రయ సంస్థ అధినేత మార్టిన్ సతీమణిగా చెప్పాలి. ఈ మధ్యనే ఆమె అన్నాడీఎంకేలో చేరారు. తాజాగా ఆమె తన నామినేషన్ ను దాఖలు చేశారు. అందులో వెల్లడించిన వివరాల ప్రకారం ఆమె తన పేరు మీద 19 కేజీల బంగారం.. 1217 క్యారెట్ల వజ్రాలు.. 13 కేజీల వెండి.. 33 గ్రాముల ప్లాటినం ఉన్నట్లుగా పేర్కొన్నారు.

రూ.139.63 కోట్ల చరాస్తులు.. రూ.909.94 కోట్ల స్థిరాస్తులు.. రూ.8.57 కోట్ల అప్పులు ఉన్నట్లుగా వెల్లడించారు. తన భర్త మార్టిన్ పేరు మీద రూ.887.36 కోట్ల ఆస్తులు ఉన్నాయని వెల్లడించారు. అదే సమయంలో కొడుకు చార్లెస్ మార్టిన్ పేరు మీద రూ.655 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని.. మొత్తంగా తమ ఫ్యామిలీ ఆస్తుల విలువ రూ.6వేల కోట్లుగా ఆమె తన అఫిడవిట్ లో వెల్లడించారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఇంత సంపన్న మహిళ చదువుకున్నది మాత్రం ఆరో క్లాస్ వరకు మాత్రమే. అంతేకాదు.. ఆమె తన మీద నాలుగు కేసులు విచారణలో ఉన్నట్లుగా పేర్కొన్నారు.

ఆమె కానీ.. ఈసారి ఎన్నికల్లో గెలిస్తే.. మరో రికార్డు ఖాయమని చెబుతున్నారు. ఇప్పటివరకు దేశంలో అత్యంత సంపన్న మహిళా ఎమ్మెల్యే రికార్డు ఏపీకి చెందిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేరు మీద ఉంది. ఆమె తన నామినేషన్ సందర్భంగా రూ.716 కోట్లుగా వెల్లడించారు. ఈ లెక్కన చూస్తే.. అన్నాడీఎంకే అభ్యర్థి లీమారోస్ ఎన్నికల్లో గెలిస్తే దేశంలోనే అత్యంత సంపన్న మహిళా అభ్యర్థిగా నిలుస్తారనటంలో సందేహం లేదు. అంతేకాదు.. దేశంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యేల జాబితాలో ఆమె పేరు ఐదో స్థానంలోకి చేరనుంది. మరి.. లాల్గుడి నియోజకవర్గ ప్రజలు ఎలాంటి తీర్పును ఇస్తారో చూడాలి.

Tags
Aidmk candidate having 1000 crores properties Tamilnadu elections
Recent Comments
Leave a Comment

Related News