అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందడంపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఏపీకి ఇది ఒక చరిత్రాత్మక, నిర్వచనాత్మక ఘట్టమని అన్నారు. ఇకపై అమరావతికి తిరుగులేదని, అమరావతి ఆంధ్రప్రదేశ్ హృదయమని చెప్పారు. భవిష్యత్తులో దేశానికే గర్వకారణంగా అమరావతి నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ బిల్లుకు లోక్ సభ, రాజ్య సభలలో ఆమోదం లభించడంతో అమరావతికి జాతీయ స్థాయిలో బలమైన గొంతుక లభించిందని అన్నారు. ఈ చారిత్రక విజయం అమరావతి రైతులకు అంకితం అని తెలిపారు. అమరావతి రాజధాని హోదా ఇప్పుడు ఎలాంటి సందేహాలకు, చర్చలకు, మార్పులకు తావులేకుండా పటిష్టంగా స్థిరపడిందని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆకాంక్షలకు అండగా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చంద్రబాబు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. విభేదాలను పక్కనపెట్టి అమరావతిని ఏకైక 'ప్రజా రాజధాని'గా పునరుద్ఘాటించిన అన్ని పార్టీలు, పార్లమెంట్ సభ్యులకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఉద్దండరాయునిపాలెంలో అమరావతి రైతుల(amaravati farmers)తో కలిసి సీఎం చంద్రబాబు(cm chandrababu) సంబరాలు చేసుకున్నారు. తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ఆ సంబరాల్లో పాలుపంచుకున్నారు. ఆ తర్వాత భువనేశ్వరితో కలిసి దీప హారతి వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.