అమరావతి(amaravati) రాజధానికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు ఈ రోజు రాజ్యసభలో కూడా ఆమోద ముద్ర లభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ సారథ్యంలో అమరావతి చట్టబద్ధత బిల్లును ఆమోదింపజేసుకున్నామని లోకేశ్(lokesh) అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. లోక్సభ, రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ కోసం అండగా నిలబడ్డ అన్ని రాజకీయ పక్షాలకు లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు. 1600 రోజుల పాటు అమరావతి రైతులు చేసిన ఉద్యమానికి ఫలితం దక్కిందని అన్నారు.
ఈ క్రమంలోనే మాజీ సీఎం జగన్ పై లోకేశ్ నిప్పులు చెరిగారు. 2019 ఎన్నికలకు ముందు ఏకైక రాజధాని అమరావతి అని జగన్ చెప్పిన మాటలను నమ్మి ప్రజలు వైసీపీని గెలిపించారని గుర్తు చేశారు. అయితే, వైసీపీ గెలిచిన 6 నెలల్లోనే అమరావతి అభివృద్ధిని అటకెక్కించిన జగన్...మూడు రాజధానుల డ్రామా మొదలుబెట్టారని విమర్శించారు. ప్రపంచంలో మూడు రాజధానుల విధానం ఎక్కడా సక్సెస్ కాలేదని లోకేశ్ చెప్పారు.
ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో కూటమి పార్టీలు పోటీ చేశాయని అన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తానని జగన్ చెప్పారని, అక్కడే తమ ఎంపీకి అత్యధిక మెజారిటీ వచ్చిందని అన్నారు. అమరావతికి తెలుగు ప్రజలు జై కొట్టారనేందుకు ఇదే నిదర్శనమన్నారు. ఒకే రాజధాని ఉన్నా అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని చెప్పామని, చేసి చూపిస్తున్నామని లోకేశ్ తెలిపారు.
అమరావతికి పట్టిన గ్రహణం వీడిందని, అందుకు గుర్తుగా ఈ రోజు సాయంత్రం 7 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల ముందు దీపాలు పెట్టాలని లోకేశ్ పిలుపునిచ్చారు. మన రాజధాని అమరావతికి దీపహారతులిద్దామని, వెలిగించిన దీపంతో సెల్ఫీ తీసుకొని ఆ ఫొటోను #APThanksIndia హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని పిలుపునిచ్చారు.