టెక్కలి(Tekkali) రాజకీయాలు సెగలు రేపుతున్నాయి. ఒకప్పుడు వైసీపీకి శ్రీకాకుళం జిల్లాలో వెన్నుముకగా నిలిచిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కథ ఆ పార్టీలో ముగిసిన అధ్యాయమేనా? తాజాగా టెక్కలిలో `చలో మూలపేట పోర్టు` పేరిట వైసీపీ నిర్వహించిన భారీ బహిరంగ కార్యక్రమం ఇదే సంకేతాన్ని పంపింది. గత కొన్నాళ్లుగా ఆయన రీఎంట్రీపై జరుగుతున్న ప్రచారానికి పార్టీ అధిష్టానం ఒకే ఒక్క చర్యతో ఫుల్ స్టాప్ పెట్టేసింది.
ఇటీవల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వైఎస్ జగన్‌ను దువ్వాడ శ్రీనివాస్ కలవడంతో, ఆయనపై ఉన్న సస్పెన్షన్ వేటు త్వరలోనే తొలగిపోతుందని అంతా భావించారు. మళ్లీ టెక్కలి పగ్గాలు ఆయనకే దక్కుతాయని అనుచరవర్గం సంబరపడింది. కానీ, టెక్కలి వేదికగా వైసీపీ(YCP) నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సీన్ మొత్తం రివర్స్ అయింది. పార్టీ ముఖ్య నేతలందరూ హాజరైన ఈ సభలో దువ్వాడకు కనీసం ఆహ్వానం కూడా అందకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇది కేవలం విస్మరణ కాదు, నీతో మాకు సంబంధం లేదు అని పార్టీ హైకమాండ్ ఇచ్చిన స్పష్టమైన క్లారిటీ అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ధర్మానతో వైరం.. శాపంగా మారిందా?
శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ధర్మాన సోదరులది ప్రత్యేక శైలి. తాజాగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు(Dharmana Prasad Rao)పై దువ్వాడ చేసిన ఘాటు వ్యాఖ్యలు వైసీపీ అధిష్టానానికి మింగుడు పడటం లేదు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు సీనియర్ నేతలను టార్గెట్ చేయడం క్రమశిక్షణారాహిత్యమేనని భావిస్తున్నారట. ధర్మాన ఫ్యామిలీకి ఉన్న పట్టును కాదని, నిరంతరం వివాదాల్లో ఉండే దువ్వాడను అక్కున చేర్చుకోవడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని వైసీపీ లెక్కలు వేస్తోంది. ఫలితంగానే, ఆయనను పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టి షెడ్ కు పంపేసినట్లు తెలుస్తోంది.
పార్టీ తనను దూరం పెట్టడాన్ని పసిగట్టిన దువ్వాడ శ్రీనివాస్(Duvvada Srinivas), ఇప్పుడు తనదైన శైలిలో కౌంటర్ అటాక్ మొదలుపెట్టారు. వైసీపీ నిరసన కార్యక్రమాలను డ్రామాగా అభివర్ణించడమే కాకుండా, మూలపేట పోర్టు నిర్వాసితుల అంశాన్ని ఎత్తుకుని సొంతంగా పోరాటానికి సిద్ధమవుతున్నారు. ``నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే పోర్టు పనులు పూర్తి చేయించాను, నా బలం ప్రజలే`` అంటూ ప్రకటించడం ద్వారా ఆయన తన భవిష్యత్తు రాజకీయ దారి వేరని సంకేతాలిచ్చారు. వైసీపీ తలుపులు క్లోజ్ అవ్వడంతో, దువ్వాడ స్వతంత్రంగా వెళ్తారా లేక మరో రాజకీయ గూటికి చేరుతారా అన్నది ఇప్పుడు ఉత్తరాంధ్ర పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.