అమరావతి(Amaravati).. ఒకప్పుడు ఇది కేవలం ఒక పేరు, కానీ ఇప్పుడు ఏపీ రాజకీయాలను శాసించే అస్త్రం. తాజాగా పార్లమెంట్‌లో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు విషయంలో జరిగిన పరిణామాలు చూస్తుంటే.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వేసిన ఎత్తుగడలకు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఊహించని షాక్ తిన్నారని స్పష్టమవుతోంది.
గత ఐదేళ్లుగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి అడగకముందే మద్దతు ఇస్తూ వస్తున్న జగన్, అమరావతి విషయంలో బీజేపీ తనను ఇబ్బంది పెట్టదని బలంగా నమ్మారు. ముఖ్యంగా చంద్రబాబుకు ప్రయోజనం చేకూరేలా మోదీ ప్రభుత్వం అడుగులు వేయదని ఆయన వేసుకున్న లెక్కలన్నీ తలకిందులయ్యాయి. బడ్జెట్ సమావేశాల చివరి నిమిషంలో హఠాత్తుగా అమరావతి బిల్లును తెరపైకి తేవడం వెనుక ప్రధాని కార్యాలయం(PMO) వ్యూహం జగన్‌కు అస్సలు అందలేదు.
ఈ మొత్తం ఎపిసోడ్‌లో అసలైన ట్విస్ట్ ఏంటంటే.. బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడానికి ముందే, ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలని స్వయంగా పీఎంవో నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సంకేతాలు వెళ్లడం. దీనిపై చంద్రబాబు(Chandrababu) సర్కార్ కూడా అంతే వేగంగా స్పందించి, అత్యవసరంగా అసెంబ్లీని సమావేశపరిచి తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇవన్నీ గమనిస్తున్న వైసీపీకి ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే ఢిల్లీలో బిల్లు రెడీ అయిపోయింది.
పార్లమెంట్‌లో అమరావతికి మద్దతు లభించిన తీరు జగన్‌ను మరింత ఆందోళనకు గురిచేసింది. చివరకు బద్ధశత్రువులైన కాంగ్రెస్ తెలంగాణ ఎంపీలు సైతం అమరావతికి మద్దతుగా నిలవడంతో వైసీపీకి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. దేశంలోని దాదాపు అన్ని పార్టీలు అమరావతి బిల్లును సమర్థిస్తుంటే, కేవలం వైసీపీ(YCP) మాత్రమే వ్యతిరేకించడం ద్వారా జాతీయ స్థాయిలో ఆ పార్టీ ఒంటరయ్యిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
లోక్‌సభలో వైసీపీ పక్ష నేత మిథున్ రెడ్డి చంద్రబాబును విమర్శిస్తూ చేసిన ప్రసంగానికి సభలో కనీస స్పందన కరువైంది. వారు వాకౌట్ చేస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడం ఆ పార్టీ ఎంపీలను విస్మయానికి గురిచేసింది. దీనిపై స్పందించిన మాజీ సీఎం జగన్(Jagan), విలేకరుల సమావేశంలో కనిపించిన తీరు ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారని చెప్పకనే చెబుతోంది. మోదీ స్నేహంపై పెట్టుకున్న నమ్మకం, చంద్రబాబు రాజకీయ చాణక్యం ముందు జగన్ వ్యూహాలు ఫలించలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.