28న అసెంబ్లీ సమావేశం.. అమరావతిపై బిగ్ అనౌన్స్‌మెంట్!

admin
Published by Admin — March 25, 2026 in Politics, Andhra
News Image

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై మరో చారిత్రక ఘట్టానికి తెరలేవబోతోంది. గత ఐదేళ్లుగా రాజధాని అనే పదం చుట్టూ అలుముకున్న అనిశ్చితికి శాశ్వత ముగింపు పలికేందుకు కూటమి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 28వ తేదీన రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. కేవలం ఒక ప్రకటనతో సరిపెట్టకుండా, అమరావతిని ఏపీ ఏకైక రాజధానిగా ఖరారు చేస్తూ అత్యంత కీలకమైన చారిత్రక తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది.

ఈ సమావేశం కేవలం ఒక ప్రకటనకే పరిమితం కాకుండా, అత్యంత వ్యూహాత్మకంగా సాగనుంది. అసెంబ్లీ ఆమోదించే ఈ తీర్మానాన్ని వెనువెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. విభజన చట్టంలోని అంశాలను సవరిస్తూ, పార్లమెంట్ రికార్డుల్లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని శాశ్వతం చేసేలా కేంద్రం ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. దీనివల్ల రేపు ఏ ప్రభుత్వం వచ్చినా మార్చలేని విధంగా రాజ్యాంగబద్ధమైన రక్షణ అమరావతికి లభించనుంది.

అలాగే ఈ చట్టబద్ధమైన క్లారిటీ రావడంతోనే రాజధాని నిర్మాణ పనులు రాకెట్ వేగంతో పుంజుకోనున్నాయి. ఇప్పటికే కేంద్రం ప్రకటించిన రూ. 15,000 కోట్ల ఆర్థిక వెన్నుదన్నుతో పాటు, ప్రపంచ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి నిధుల సేకరణకు ఉన్న టెక్నికల్ అడ్డంకులన్నీ ఈ తీర్మానంతో పటాపంచలు కానున్నాయి. ఐకానిక్ భవనాలు, గ్రిడ్ రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన జరగబోతున్నాయి.

రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నామనే ఐదు కోట్ల ఆంధ్రుల ఆవేదనకు ఈ నెల 28వ తేదీ ఒక పరిష్కారం చూపబోతోంది. రాజకీయాలకు అతీతంగా, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని అకాంక్షిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. న్యాయపరమైన వివాదాలకు చెక్ పెడుతూ, పెట్టుబడిదారులకు నమ్మకాన్ని కల్పిస్తూ అమరావతిని వరల్డ్ క్లాస్ సిటీగా తీర్చిదిద్దే ప్రక్రియలో ఇది తొలి, అతి ముఖ్యమైన అడుగు కానుంది.

Tags
Amaravati AP Capital Andhra Pradesh AP Assembly Chandrababu Naidu Pawan Kalyan Nara Lokesh
Recent Comments
Leave a Comment

Related News