రాజకీయాల్లో కొన్నిసార్లు అంకెలు విచిత్రమైన ఆట ఆడుతుంటాయి. గత ఎన్నికల్లో వైసీపీకి ఎదురైన ఫలితం ఆ పార్టీని ఒక ప్రత్యేకమైన సంఖ్యతో ముడిపెట్టేలా చేసింది. వైనాట్ 175 అంటూ ఎన్నికల బరిలోకి దిగిన వైసీపీని, ఏపీ ఓటర్లు కేవలం 11 స్థానాలకే పరిమితం చేశారు. అప్పటి నుండి సోషల్ మీడియాలో ప్రత్యర్థులు చేస్తున్న ట్రోల్స్ ఆ పార్టీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా ఈ 11 గండం అమరావతి దాటి ఢిల్లీ పార్లమెంటు గడప వరకు వెళ్లడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అన్నీ 11 చుట్టూనే తిరిగాయని రాజకీయ విశ్లేషకులు చర్చించుకున్నారు. సభ ప్రారంభమైన తేదీ నుంచి, సమయం వరకు అన్నీ 11 నంబర్ వచ్చేలా ఉండటం యాధృచ్చికమే అయినా, వైసీపీకి మాత్రం అది మింగుడుపడలేదు. అయితే, తాజాగా దేశ రాజధానిలో కొత్తగా నిర్మించిన సెంట్రల్ విస్టా (కొత్త పార్లమెంటు) భవనంలో కూడా వైసీపీకి ఇదే 11 నంబర్ ఎదురైంది. పార్టీల బలాబలాలను బట్టి గదులు కేటాయించే క్రమంలో, స్పీకర్ ఓం బిర్లా వైసీపీకి రూమ్ నంబర్ 11 కేటాయించడంతో ఎంపీలు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
రూమ్ నంబర్ వద్దని పట్టుబట్టిన ఎంపీలు!
తమను ఉద్దేశపూర్వకంగానే ఈ నంబర్ తో అవమానిస్తున్నారని భావించిన వైసీపీ ఎంపీలు వెంటనే రంగంలోకి దిగారు. స్పీకర్ కార్యాలయానికి వెళ్లి తమకు 11వ నంబర్ గది వద్దని, దాన్ని మార్చాలని గట్టిగా విన్నవించారు. రాష్ట్రంలో ఇప్పటికే ఈ నంబర్ వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ట్రోల్స్ గురించి వివరిస్తూ.. ఇది కేవలం కేటాయింపు కాదని, తమను హేళన చేయడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, రూల్స్ ప్రకారం కేటాయించిన రూమ్ మార్చడం కుదరదని మొదట స్పీకర్ కార్యాలయం స్పష్టం చేయడంతో అక్కడ కాసేపు ఉత్కంఠ నెలకొంది.
వైసీపీ ఎంపీల పట్టుదల చూసి, చివరకు ఉత్తరాదికి చెందిన ఓ కేంద్ర మంత్రి జోక్యంతో ఈ సమస్య ఓ కొలిక్కి వచ్చింది. వారి అభ్యర్థనను మన్నించిన స్పీకర్, రూమ్ నంబర్ 11కు బదులుగా రూమ్ నంబర్ 12ను కేటాయించారు. దీంతో వైసీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ విషయంపై సెటైర్లు ఆగడం లేదు. ఎక్కడికి వెళ్లినా 11 వదలడం లేదే.. అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా, వైసీపీకి ఈ 11 సెంటిమెంట్ ఒక తీరని తలనొప్పిగా మారిందనేది మాత్రం స్పష్టమవుతోంది.