ఏపీ రాజకీయాల్లోనూ, సినీ వర్గాల్లోనూ గత కొద్దిరోజులుగా నలుగుతున్న ఒక కీలక ప్రశ్నకు ఏపీ హైకోర్టు(AP High Court) గట్టి సమాధానం చెప్పింది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్, సినిమాల్లో నటించడం రాజ్యాంగ విరుద్ధమంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం, పిటిషనర్ వాదనలను తోసిపుచ్చడమే కాకుండా ఘాటు వ్యాఖ్యలు చేసింది.
మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ హైకోర్టులో ఒక ప్రజాహిత వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ `హరిహర వీరమల్లు` వంటి వాణిజ్య చిత్రాల్లో నటించడం అనైతికమని, ఇది పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందికి వస్తుందని ఆయన వాదించారు. అంతేకాకుండా, సినిమా టికెట్ల ధరల పెంపు ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ (AG) బలమైన వాదనలు వినిపించారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విషయంలో హైకోర్టు ఫుల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా గుర్తు చేశారు. ``ఒక వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఉన్నంత మాత్రాన, తన వృత్తిని కొనసాగించకూడదని ఎక్కడా లేదు. టికెట్ ధరల పెంపు అనేది ప్రభుత్వ పాలసీ నిర్ణయం, దానికి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ప్రమేయానికి సంబంధం లేదు`` అని ఏజీ స్పష్టం చేశారు.
ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, పిటిషనర్ వాదనలో పస లేదని తేల్చి చెప్పింది. కోర్టు విలువైన సమయాన్ని వృథా చేసినందుకు మాజీ ఐఏఎస్‌పై న్యాయస్థానం సీరియస్ అయ్యింది. ఇలాంటి అర్థం లేని పిటిషన్లు వేసినందుకు భారీగా ఖర్చులు చెల్లించాలని ఆదేశిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. ఇక ఈ తీర్పుతో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సినిమాల్లో నటించడానికి ఉన్న న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోయినట్లయ్యింది. రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూనే, తనకిష్టమైన నటనను కొనసాగించేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.