మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani) నోరు విప్పితే చాలు.. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయో లేదో తెలీదు కానీ, వినేవారి చెవుల్లో మాత్రం తుప్పు వదలాల్సిందే. తాజాగా జొన్నపాడులో జరిగిన ఒక దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న నాని, అక్కడ కూడా తన రాజకీయ మార్కును వదల్లేదు. అసలు సందర్భం ఏదైనా, టాపిక్ మాత్రం జగన్ మోహన్ రెడ్డి గొప్పతనం గురించే ఉండాలని ఆయన ఫిక్స్ అయిపోయినట్లున్నారు. జగన్ తన ఆస్తుల్లో సోదరీమణులకు వాటా ఇచ్చారని, ఆయన అంతటి సంస్కారవంతుడు మరొకరు లేరని నాని ఒక రేంజ్ లో సర్టిఫికెట్ ఇచ్చేశారు.
జగన్ అంతటి ఉత్తముడు అని నాని చెబుతుంటే, నెటిజన్లు మాత్రం పాత పేపర్ క్లిప్పింగులను బయటకు తీస్తున్నారు. సొంత తల్లి విజయమ్మనే వదలకుండా చంద్రబాబు(Chandrababu) కోవర్టు అంటూ సొంత పత్రికలో కథనాలు వస్తుంటే, అప్పుడు ఆ సంస్కారం ఎటు పోయిందని ప్రశ్నలు కురిపిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డలు, ఒకప్పుడు జగన్ కోసం పాదయాత్రలు చేసిన షర్మిల, సునీతలను ఇప్పుడు అదే పార్టీ సోషల్ మీడియా సైన్యం ఏ స్థాయిలో టార్గెట్ చేస్తోందో చూస్తుంటే.. నాని చెబుతున్న ఆదర్శ సోదరుడి వేషం ఎక్కడో తేడా కొడుతోందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
ఇక కొడాలి నాని సంస్కారం గురించి మాట్లాడటమే ఈ ఏడాదికి అతిపెద్ద జోక్ అని సోషల్ మీడియాలో కామెంట్స్ పేలుతున్నాయి. అసెంబ్లీలోనూ, బయటా ప్రత్యర్థులపై బూతుల పురాణం చదివించే నాని, ఇప్పుడు జగన్ కి క్యారెక్టర్ సర్టిఫికెట్ ఇవ్వడం చూస్తుంటే.. దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లు ఉందని కొందరు విమర్శిస్తున్నారు. చెల్లెలు షర్మిల(YS Sharmila) రోడ్డు మీద నిలబడి న్యాయం కోసం కొట్లాడుతుంటే, సునీత తన తండ్రి హంతకుల కోసం ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతుంటే.. జగన్ పంచుతున్నది ఆస్తులా లేక ఆవేదనలా? అని జనం నిలదీస్తున్నారు.
రాచమల్లు శివప్రసాద్ రెడ్డి లాంటి నేతలతో షర్మిలపై ఘాటు వ్యాఖ్యలు చేయించి, ఆ తర్వాత ఏమీ తెలియనట్టు మౌనం వహించడం కూడా జగన్ సైలెంట్ సంస్కారంలో భాగమే కావొచ్చు. మొత్తానికి, కొడాలి నాని ఇచ్చిన ఈ సర్టిఫికెట్ జగన్(Jagan) కు మైలేజ్ తెస్తుందో లేదో తెలియదు కానీ, నెటిజన్లకు మాత్రం మంచి వినోదాన్ని అందిస్తోంది. సొంత కుటుంబ సభ్యులే నమ్మని ఈ సంస్కార పాఠాలన ప్రజలు నమ్ముతారని నాని భావించడం ఆయన అమాయకత్వమో లేక అతి విశ్వాసమో కాలమే నిర్ణయించాలి.