తెలంగాణ ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ` గద్దర్ అవార్డుల`(Gaddar Awards) వేడుక.. చివరకు ఒక కామెడీ షోగా మిగిలిపోయింది. లోకల్ ఫ్లేవర్ ఉండాల్సిన చోట, ముంబై నుంచి దిగుమతి చేసుకున్న ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ పుణ్యమా అని.. అవార్డు గ్రహీతలకు గౌరవం కంటే, అవమానాలే ఎక్కువగా దక్కాయి. అచ్చం మన ఊరి జాతరను తీసుకెళ్లి.. తెలుగు రాని ఉత్తరాది వాళ్లకు అప్పగిస్తే ఎలా ఉంటుందో, ఈ వేడుక అలానే సాగింది.
ప్రపంచవ్యాప్తంగా ` బాహుబలి`, ` RRR` సినిమాలతో తెలుగు ఖ్యాతిని చాటిన రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్రప్రసాద్(Vijayendra Prasad)కే అక్కడ చుక్కెదురైంది. ఆయన ఎవరో తెలియక ముంబై బౌన్సర్లు అడ్డుకోవడం, పేరు అడగడం చూస్తుంటే.. నిర్వాహకుల విజ్ఞత ఏపాటిదో అర్థమవుతోంది. కనీసం ఆయనకు గౌరవప్రదమైన సీటు కూడా కేటాయించకుండా వెనుక వరుసలో కూర్చోపెట్టడంతో, ఆయన నొచ్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది.
ఇక పేదల మనిషి, ప్రజా యుద్ధనౌకకు అత్యంత సన్నిహితుడైన ఆర్.నారాయణమూర్తి(R. Narayana Murthy) పరిస్థితి మరీ ఘోరం. స్వయంగా అవార్డు అందుకోవడానికి వచ్చిన ఆయన్ని మీడియా పాయింట్ దగ్గరే ఆపేసి మీ పాస్ ఎక్కడ? అని అడగడం నిర్వాహకుల మూర్ఖత్వానికి పరాకాష్ట. కాంతారావు అవార్డు గ్రహీత ఎవరో కూడా తెలియని వాళ్ళను తీసుకొచ్చి గేట్ల దగ్గర పెడితే.. అది వేడుక అవుతుందా లేక వేధింపు అవుతుందా అని సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
మరోవైపు లోపలికి వెళ్ళిన అతిథులకు కూడా కష్టాలు తప్పలేదు. ఎవరికి ఏ సీటు కేటాయించారో తెలియదు, అడిగితే చెప్పే నాధుడు లేడు. అప్పటికప్పుడు కుర్చీలు వెతుక్కునే పరిస్థితి. కొందరైతే కుర్చీలు దొరక్క నిలబడే ప్రోగ్రాం చూడాల్సి వచ్చింది. తెలంగాణ ఎఫ్డీసీ (FDC) అధికారులు మాత్రం మాకేం సంబంధం లేదన్నట్లు చేతులు ముడుచుకుని కూర్చోవడం విడ్డూరం. మన సంస్కృతి, మన భాష తెలిసిన స్థానిక సంస్థలకు కాకుండా.. కేవలం గ్లామర్ కోసం ముంబై సంస్థకు బాధ్యతలు ఇవ్వడం వల్ల గద్దర్ ఆశయాలకు తూట్లు పొడిచినట్లయింది.