తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీకి ఎంతగానో దోహదపడిన ఆరు గ్యారెంటీల అమ లుపై విపక్షాలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. వీటిని సక్రమంగా అమలు చేయడం లేదని.. కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యారని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ నాయకులు పెద్ద ఎత్తున విమ ర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీలకు ప్రభుత్వం 50,713 కోట్ల రూపాయలను కేటాయించింది.
మొత్తం బడ్జెట్ 3,24,234 కోట్ల రూపాయల్లో రెవెన్యూ వ్యయానికి రూ.2,34,406 కోట్లు కేటాయించారు. ఇక, దీని తర్వాత.. మొత్తం ఆరు గ్యారెంటీలకు 50,713 కోట్ల రూపాయలను కేటాయించడం గమనార్హం. ఈ మొత్తం లో రైతు భరోసాకు రూ.18,000 కోట్లు, చేయూత పథకానికి రూ.14,861 కోట్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5,500 కోట్లు, మహాలక్ష్మి పథకానికి(ఆర్టీసీ ఉచిత ప్రయాణం) రూ.4,305 కోట్లు కేటాయించారు. రైతు భరోసాతో సంబంధం లేకుండా.. సన్న వడ్లకు బోనస్ ఇచ్చేందుకు రూ.3,500 కోట్లు ఇచ్చారు.
ఇక, ఎస్సీ సామాజిక వర్గాలకు ఇచ్చే ఉచిత విద్యుత్(200 యూనిట్ల వరకు)కు గృహ జ్యోతి పథకం కింద రూ.2,080 కోట్లు కేటాయించారు. ఒకవైపు ఇందిరమ్మ ఆరోగ్య బీమాను ప్రకటించిన ప్రభుత్వం మరోవైపు.. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకానికి కూడా రూ.1,143 కోట్లు కేటాయించడం గమనార్హం. ఇక, మహాలక్ష్మి పథకం కింద ఎల్‌పీజీ సబ్సిడీ ని రూ.723 కోట్లుకు పెంచారు. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రూ.600 కోట్లు కేటాయించారు. బియ్యం సబ్సిడీ(రేషన్)కి రూ.3,000 కోట్లు ఇచ్చారు.
కల్యాణ్ లక్ష్మి పథకానికి నిధులను పెంచారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద వివాహితలకు ఇచ్చే రూ.లక్షను రూ.1.30 లక్షలకు పెంచారు. ఈ పథకానికి(కల్యాణలక్ష్మి / షాది ముబారక్) రూ.3,683 కోట్లు కేటాయించారు. అలాగే.. విద్యార్థుల డైట్ ఛార్జీలకు రూ.2,170 కోట్లు, స్కాలర్‌షిప్‌లు - రూ.4,343 కోట్లకు పెంచారు.