వెండితెరపై తన స్టైల్ మరియు నటనతో అలరించే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నిజజీవితంలోనూ తన మానవత్వాన్ని చాటుకుని మరోసారి రియల్ హీరోఅనిపించుకున్నారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన బాణసంచా ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో కడింపల్లి దుర్గ అనే మానసిక దివ్యాంగురాలు తన తండ్రిని కోల్పోయి ఒంటరిదైపోయింది. అంతకుముందే తల్లిని కోల్పోయిన ఆ అమ్మాయికి, ఇప్పుడు తండ్రి కూడా దూరమవ్వడంతో ఆమె జీవితం ప్రశ్నార్థకంగా మారింది. ఈ హృదయ విదారక గాథ విన్న బన్నీ, తక్షణమే స్పందించి ఆమెకు వెన్నుముకగా నిలిచారు.
దుర్గ దీనస్థితిని చూసి చలించిన అల్లు అర్జున్, కేవలం ఒక్కసారి సాయం చేసి చేతులు దులపుకోకుండా, ఆమెకు జీవితాంతం తోడుంటానని మాట ఇచ్చారు. ఇందులో భాగంగానే ప్రతినెలా రూ.7,500 ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే తాజాగా మొదటి నెలకు సంబంధించిన మొత్తాన్ని ఆమె బ్యాంక్ ఖాతాలో జమ చేసి తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. ఈ విషయాన్ని దుర్గ తరఫు వారు సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో అల్లు అర్జున్ చేసిన ఈ ఉదారత వెలుగులోకి వచ్చింది. పబ్లిసిటీకి దూరంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఒకవైపు బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నప్పటికీ, కష్టాల్లో ఉన్న వారిని మర్చిపోకుండా ఆదుకోవడం అల్లు అర్జున్ గొప్పతనానికి నిదర్శనం. గతంలో సినీనటి పావలా శ్యామలకు కూడా ఇదే తరహాలో ఆర్థిక భరోసా కల్పించిన ఆయన, ఇప్పుడు దుర్గకు అండగా నిలిచి తన పెద్ద మనసును మరోసారి నిరూపించుకున్నారు.