హైదరాబాద్ శివారులోని మొయినాబాద్‌లో జరిగిన వీకెండ్ పార్టీలో డ్రగ్స్ వినియోగించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్(putta mahesh) యాదవ్‌పై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు(cm chandrababu) తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఘటనలతో పార్టీ పరువు పోతోందని వ్యాఖ్యానించారు. నేతల కంటే పార్టీనే ముఖ్యమని తెలిపారు. ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పుట్టా మహేష్‌ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని టీడీపీ ఏపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. అంతేకాదు.. పట్టాకు నోటీసులు ఇచ్చి వివరణ కూడా తీసుకోవాలని కోరారు.
ఎవరి కోసం?
పార్టీలో ఉన్న వారు ఎవరి కోసం పనిచేస్తున్నారు? బయట ఏం చేస్తున్నారు? అని చంద్రబాబు సీరియస్ అయినట్టు తెలిసింది. ``అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనవద్దని, మత్తు పదార్థాల జోలికి వెళ్లవద్దని సామాన్యులకు మనం చెబుతున్నప్పుడు.. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియదా?`` అని చంద్రబాబు ప్రశ్నించారు. ఏకంగా ఎంపీ స్థాయి నాయకుడే మాదక ద్రవ్యాల కేసులో ఆరోపణలు ఎదుర్కొనడం ఏంటని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. వ్యక్తుల బలహీనతలకు.. వారు చేస్తున్న తప్పులకు పార్టీని బలి చేయలేమన్నారు.
అంతేకాదు.. డ్రగ్స్ వంటి బలమైన ఆరోపణలు ఎదుర్కొన్న వారిని ఉపేక్షించేది లేదని కూడా చంద్రబాబు తేల్చి చెప్పారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర చీఫ్ పల్లా శ్రీనివాసరావును ఆయన ఆదేశించారు. ఇదిలావుంటే.. గత 2024 ఎన్నికల్లో తొలిసారి ఏలూరు నుంచి ఎంపీగా విజయం దక్కించుకున్న పుట్టా మహేష్‌కు రాజకీయంగా కుటుంబనేపథ్యం చాలానే ఉంది. ఆయన తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్.. మైదుకూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మామ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కావడం గమనార్హం.
ఇదే తొలిసారి కాదు!
కాగా..పుట్టా మహేష్‌కుమార్‌పై డ్రగ్స్ ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది కూడా ఆయనపై ఇదే ప్లేస్‌లో ఇదే మిత్రులతో కలిసి డ్రగ్స్ తీసుకున్న ఆరోపణలు వచ్చాయి. అయితే.. ఆకేసు ఏమైందో ఏమో..తాజాగా జరిగిన పార్టీలో బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఇదిలావుంటే.. పుట్టా మహేష్‌కుమార్‌కు పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఎంపీ కావడంతో పోలీసులు ఆయనకు స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు.