ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా ఎన్నారై కోమటి జయరాం(jayaram komati) నియమితులైన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఆయన బాధ్యతలు కూడా చేపట్టారు. ఈ క్రమంలోనే విజయవాడలో ప్రవాసాంధ్రుల వారధి అయిన జయరాం కోమటి ఆత్మీయ అభినందన సభ, సత్కార కార్యక్రమం(felicitation) ఘనంగా జరిగింది.
విజయవాడ(vijayawada)లోని పోరంకిలో ఉన్న మురళీ రిసార్ట్ లో జరిగిన ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, నటకిరీటి రాజేంద్రప్రసాద్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితోపాటు పలువురు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు, ఎన్నారైలు హాజరయ్యారు. వారంతా దుశ్వాలువాతో జయరాం కోమటిని సన్మానించారు. ఆ తర్వాత జయరా కోమటిపై వారు పూల వర్షం కురిపించారు. ఎన్నారైలకు జయరాం కోమటి అందించిన సేవలను వారంతా కొనియాడారు.
అమెరికాలోని తెలుగువారందరినీ ఒక్కతాటిపైకి తెచ్చిన ఘనత జయరాం కోమటిదని పెమ్మసాని కొనియాడారు. ప్రవాసాంధ్రుల వారధిగా పేరుపొందిన జయరాం కోమటి TANAను ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. చాలామంది పెళ్లిళ్లు కూడా ఇంత ఆహ్లాదకరంగా జరగవని, ఎంత డబ్బు ఉన్నా, ఎంత పెద్ద పదవి వచ్చినా ఈ స్థాయిలో కార్యక్రమం జరగడం సాధ్యం కాదని, అది కేవలం జయరాం కోమటికి మాత్రమే సాధ్యమైందని అన్నారు.
గతంలో ఆయన చేసిన కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. తాను 25 ఏళ్లు అమెరికాలో ఉన్నానని, తాను అమెరికా వెళ్లకముందే బాగా పేరు సంపాదించిన వ్యక్తి ఆయన అని కొనియాడారు. బహుశా తాను పుట్టకముందే కాలిఫోర్నియాలో ఆయన హోటల్ పెట్టి ఇండియా నుంచి ఎవరు అమెరికా వెళ్లినా గమ్యస్థానంగా ఆ హోటల్ ను తయారుచేశారని అన్నారు. తెలుగువారి ఐక్యత కోసం తానాను ముందుకు తీసుకువెళ్లి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేసుకున్నారు.
అమరావతి రైతుల కోసం ఎంతో శ్రమించారని, ఎన్నో కార్యక్రమాలు చేశారని, ఎన్నారైల నుంచి నిధులు సేకరించారని, తాను కూడా తన వంతు సహకారమందించానని గుర్తు చేసుకున్నారు. ఏ కార్యక్రమాన్నైనా తన భుజాలపై మోసుకొని చేయడం ఆయనకు అలవాటని ప్రశంసించారు. టీడీపీ కష్టకాలంలో ఉన్న సమయంలో ఎన్నారైలను ఒక్కతాటిపైకి తేవడం, టీడీపీ కార్యకర్తలను ఏకం చేసిన మాస్ లీడర్ ఆయనని కొనియాడారు. అటువంటి జయరాం కోమటికి సముచిత పదవి, గౌరవం కల్పించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కు పెమ్మసాని ధన్యవాదాలు తెలిపారు.