పిఠాపురంలో బాబుకు అవ‌మానం.. అలిగిన వ‌ర్మ‌..!

admin
Published by Admin — March 13, 2026 in Politics, Andhra
News Image

మొన్నటి ఎన్నికల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తన సర్వస్వాన్ని ధారపోసిన టీడీపీ ఇన్‌ఛార్జ్ ఎస్‌వీఎస్ఎన్ వర్మ, ఇప్పుడు అదే గడ్డపై తీవ్ర ఆగ్ర‌హానికి గురయ్యారు. కూటమి ప్రభుత్వంలో అంతా సవ్యంగా ఉందనుకుంటున్న తరుణంలో, ప్రోటోకాల్ విషయంలో జరిగిన ఒక పొరపాటు పిఠాపురంలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్‌ను పెంచేసింది.

అసలు విషయం ఏంటంటే.. పిఠాపురంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికుల కోసం ఒక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోను అత్యంత చిన్నదిగా ముద్రించారు. కార్యక్రమానికి అతిథిగా వచ్చిన వర్మ కళ్ళలో ఇది పడటమే ఆలస్యం.. ఒక్కసారిగా సీన్ మారిపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన కనీస గౌరవం ఇదేనా? అని ఆయన మున్సిపల్ అధికారులను నిలదీశారు.

సీఎం ఫోటో కంటే ఇతరుల ఫోటోలే హైలైట్ అవ్వడంపై వర్మ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాబుకే గౌరవం లేనప్పుడు ఇక్కడ మేము ఉండటం ఎందుకు? అంటూ అక్కడికక్కడే అధికారులపై విరుచుకుపడ్డారు. వర్మ అంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా, వేదికపై ఉన్న జనసేన నాయకులు మాత్రం మౌనంగా ఉండిపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీంతో మనస్తాపానికి గురైన వర్మ, ఆ శిక్షణా కార్యక్రమాన్ని మధ్యలోనే వదిలేసి అలిగి బయటకు వెళ్ళిపోయారు.

పిఠాపురంలో టీడీపీ-జనసేన మధ్య గ్రౌండ్ లెవల్‌లో సఖ్యత లేదనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. పవన్ గెలుపులో వర్మ పాత్ర కీలకం అని అందరికీ తెలిసినా, అక్కడ జనసేన కేడర్ వర్మను పక్కన పెడుతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజా ఘటనతో ఈ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఇది కేవలం అధికారుల పొరపాటా? లేక కావాలని జరిగిన పరాభవమా? అన్నది ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ డిబేట్‌గా మారింది.

Tags
Pithapuram SVSN Varma Chandrababu Naidu Pawan Kalyan AP Politics TDP Janasena
Recent Comments
Leave a Comment

Related News