ఏపీ సీఎం చంద్రబాబు విజన్ గురించి.. ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదని తరచుగా చాలా మంది అంటుంటారు. చాలా వ్యూహాత్మకంగా.. ముందు తరాలకు ఉపయోగపడేలా ఆయన విజన్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఏం చేసినా.. రాష్ట్రానికి సంబంధించి.. భవిష్యత్తు పునాదులు బలంగా ఉండేలా చూసుకుంటారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. రాష్ట్ర మంత్రి, గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్.. తన సోషల్ మీడియాలో ఆసక్తికర పీఠిక రాసుకున్నారు.

తాజాగా రెండు రోజుల పాటు మంత్రులు, కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా తాను గమనించిన అంశాలు.. చంద్రబాబు పనితీరు.. 76 ఏళ్ల వయసులో కూడా ఆయన ఎంత ఉత్సాహంగా.. పనిచేస్తున్నారు ? అనే అంశాలను మంత్రి హైలెట్ చేశారు. ఉదయం 10 గంటలకు మొదలైన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు నేను ఒక కేబినేట్ మంత్రిగా హాజరైనా, ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు ఓ విద్యార్ధిలా మారిపోయాను. అని చెప్పుకోవడం ద్వారా మంత్రి ఈ సదస్సును చూసిన కోణం.. చంద్రబాబు ఈ సదస్సును నిర్వహించిన విధానం వంటివి స్పష్టమవుతాయి.
అంతేకాదు.. ప్రతి విషయంలోనూ.. కేవలం నేటి గురించే కాకుండా.. రేపటి గురించి కూడా లోతుగా ఆలోచించే మనస్తత్వం ఉన్న నాయకుడుగా చంద్రబాబు హైలెట్ అయ్యారని ప్రశంసలు గుప్పించారు. అనేక సందర్భాల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ పేరుతో కలెక్టర్లు.. వివరించిన అంశాలు కూడా చాలా ఆకట్టుకున్నాయని చెప్పారు. ఇదంతా సీఎం చంద్రబాబు వల్లే సాకారం అయిందని మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి ఒక బృహత్తర కార్యక్రమం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి అని చెప్పుకొని రావడం గమనార్హం.

76 ఏళ్ల వయసులో కూడా.. నవ యువకుడి మాదిరిగా గంటల తరబడి సమీక్షలు చేయడమే కాకుండా.. సుదీర్ఘ ప్రసంగాలు.. సమీక్షలు.. రాష్ట్రానికి దిశానిర్దేశం చేసి తీరు.. నేటితరంలో ఉన్న తమ లాంటి వారికి ఎంతో మేలు చేస్తాయని మంత్రి చెప్పుకొచ్చారు. స్పష్టమైన విజన్, అనుభవం ఉన్న నాయకుడితో కలిసి పని చేయడం ఆ దేవుడు ఇచ్చిన వరం. అని మంత్రి తన మనసులోని మాటలను సామాజిక మాధ్యమంలో రాసుకొచ్చారు. అనర్గళంగా మాట్లాడటం ఒక ఎత్తు అయితే, అధికారులను సబ్జెక్ట్ పరంగా అడుగుతున్న ప్రశ్నలు విని ఆశ్చర్యపోయిన సందర్భాలు కోకొల్లలు. అని మంత్రి హర్షం వ్యక్తం చేశారు.