ఇంట్లో వంట గ్యాస్ అయిపోతే హోటల్ నుంచి తెచ్చుకుంటాం.. కానీ దేశంలోనే గ్యాస్ కొరత ఏర్పడితే? ఆ సెగ ఏకంగా ఐటీ కారిడార్ వరకు తాకింది. సాధారణంగా పెరిగిన ట్రాఫిక్ అనో, లేక ఏదైనా వైరస్ వస్తుందనో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే కంపెనీలు, ఇప్పుడు `గ్యాస్ లేదు.. ఆఫీసులకు రావొద్దు` అంటూ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చిలికి చిలికి గాలివానలా మారడంతో దేశీయంగా ఎల్‌పీజీ (LPG) సంక్షోభం తలెత్తింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వల్ల గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో, ఆ ప్రభావం నేరుగా ఐటీ దిగ్గజాల కిచెన్లలో పడింది. ముఖ్యంగా చెన్నైలోని హెచ్‌సీఎల్ టెక్ (HCL Tech) ఆఫీసులో గ్యాస్ కొరత కారణంగా కెఫెటేరియా సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. వేలమంది ఉద్యోగులకు ఆహారం అందించడం సాధ్యం కాకపోవడంతో, మేనేజ్‌మెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది. క్యాంటీన్‌లో వంట చేసే పరిస్థితి లేదు.. కాబట్టి రెండు రోజులు ఆఫీసుకు రాకుండా ఇంటి నుంచే పని (WFH) చేయండి అంటూ మార్చి 12, 13 తేదీల్లో సెలవు తరహా వెసులుబాటు కల్పించింది.
మరోవైపు బెంగళూరు ఐటీ హబ్‌లో ఇన్ఫోసిస్ (Infosys) పరిస్థితి అదే చందంగా ఉంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత వేధిస్తుండటంతో, కంపెనీ తన మెనూను భారీగా తగ్గించేసింది. ఆఫీసు నమ్ముకుని ఖాళీ కడుపుతో రావొద్దని, వీలైనంత వరకు ఇంటి నుంచే భోజనం తెచ్చుకోవాలని ఉద్యోగులకు స్పష్టమైన సూచనలు చేసింది. గ్యాస్ ధరలు పెరగడం ఒక ఎత్తయితే, అసలు సిలిండర్లు దొరకకపోవడం ఐటీ కంపెనీల క్యాంటీన్ ఆపరేటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
హార్మూజ్ జలసంధి మూసివేత, మిసైళ్ల దాడుల నేపథ్యంలో భారత్‌లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గృహ వినియోగ సిలిండర్‌పై రూ. 60, కమర్షియల్ సిలిండర్‌పై రూ. 144 పెరగడంతో హోటళ్లు, రెస్టారెంట్లు ఇప్పటికే బోర్డులు తిప్పేస్తున్నాయి. లక్షలాది మంది ఉద్యోగులు పనిచేసే ఐటీ కంపెనీల్లో క్యాంటీన్లు మూతపడితే, ఆ ప్రభావం నేరుగా ఉత్పాదకతపై పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ప్రస్తుతానికి రిమోట్ వర్క్ వైపు మొగ్గు చూపుతున్నాయి కంపెనీలు. మొత్తానికి, ఎక్కడో జరుగుతున్న యుద్ధం మన ఐటీ ఉద్యోగుల రోజువారీ జీవితాన్ని మార్చేసింది. ఆఫీస్ లాంచ్‌లో వేడి వేడి భోజనం చేసే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, ఇప్పుడు గ్యాస్ పుణ్యమా అని మళ్ళీ ల్యాప్‌టాప్‌లతో ఇంట్లోనే సెటిల్ అయిపోతున్నారు.