బీఆర్ ఎస్ పార్టీ తరఫున 2023 ఎన్నికల్లో విజయం దక్కించుకుని.. తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా మారిన.. 10 మంది ఎమ్మెల్యేలపై కోర్టుల ఆదేశాల మేరకు.. విచారణ జరిపిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాదరావు.. తాజాగా కడియం శ్రీహరి(వరంగల్), దానం నాగేందర్(danam nagendar)(ఖైరతాబాద్)లకు కూడా క్లీన్ చిట్(clean chit) ఇచ్చారు. ఈ మేరకు అసెంబ్లీ సచివాలయం కీలక ప్రకటన చేసింది.
ఈ క్లీన్ చిట్‌లో.. దానం, కడియం పార్టీలు మారారని నిరూపించే ఒక్క ఆధారం కూడా లేదని.. వారు ఎంతో నిబద్ధతతో బీఆర్ ఎస్ పార్టీకి పనిచేస్తున్నారని పేర్కొనడం గమనార్హం. వారిపై అనర్హత చర్యలు తీసుకు నేందుకు అవకాశం లేదన్నారు. ``ఒక పార్టీ తరఫున గెలిచి.. అధికారికంగా పార్టీ మారితేనే అనర్హత చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ, ఈ కేసుల్లో ఎక్కడా అలాంటి ఆధారాలు లేవు.`` అని సచివాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
అంతేకాదు.. అనర్హత పిటిషన్లు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఎవరూ.. బీఆర్ ఎస్ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేయలేదని తెలిపారు. అదేసమయంలో వేరే ఇతర పార్టీల సభ్యత్వం కూడా తీసుకోలేదని చెప్పారు. ఈ క్రమంలో వారికి అనర్హత చట్టం వర్తించబోదని చెప్పారు. ఈ మేరకు దానం, కడియంలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక, ఇప్పటికే 8 మంది బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలకు కూడా ఆయన క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇదిలావుంటే.. అనర్హత పిటిషన్లపై స్పీకర్ చర్యలు తీసుకోవాలంటూ.. రెండు దఫాలుగా సుప్రీంకోర్టు ఇచ్చిన సమయం ముగిసింది. దీంతో గురువారం వీటిపై సుప్రీంకోర్టు విచారణ చేయనుంది. ఈ క్రమంలో స్పీకర్ బుధవారంమిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇవ్వడం గమనార్హం. దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది వేచి చూడాలి. మరోవైపు.. ఇదంతా తాము ముందు నుంచి ఊహించిందేనని.. స్పీకర్ ఇదే తీర్పు ఇస్తారని తమకు తెలుసునని బీఆర్ ఎస్ వర్గాలు పేర్కొన్నాయి.