టెక్ ప్రపంచంలో ఇప్పుడు ఒక భారతీయ నామం సంచలనం సృష్టిస్తోంది. గూగుల్(Google) మాతృ సంస్థ `ఆల్ఫాబెట్`, తన సీఈఓ సుందర్ పిచాయ్‌కు ప్రకటించిన కొత్త వేతన ప్యాకేజీతో ప్రపంచ కార్పొరేట్ రంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అసాధారణ ప్రతిభతో గూగుల్‌ను శిఖరాగ్రాన నిలబెట్టినందుకు గాను, ఆయనకు దక్కిన ఈ గౌరవం ఇప్పుడు ఆయన్ని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎగ్జిక్యూటివ్‌గా మార్చేసింది.
ఆల్ఫాబెట్ బోర్డు సుందర్ పిచాయ్(Sundar Pichai)కు రాబోయే మూడేళ్ల కాలానికి (2026-2028) కలిపి 692 మిలియన్ డాలర్ల భారీ ప్యాకేజీని ప్రకటించింది. మన భారతీయ కరెన్సీలో దీని విలువ సుమారు 6,361 కోట్ల రూపాయలు. ఈ భారీ మొత్తం ఆయన పనితీరు, కంపెనీ సాధించే వృద్ధి లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. ఈ భారీ ఆదాయం కేవలం నగదు రూపంలోనే ఉండదు. ఇందులో వివిధ విభాగాలు ఉన్నాయి. సింహభాగం కంపెనీ సాధించే ఫలితాలపైనే ఆధారపడి ఉంటుంది.
సుమారు 126 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ యూనిట్లు పిచాయ్ పనితీరుతో ముడిపడి ఉన్నాయి. ఒకవేళ ఆల్ఫాబెట్(Alphabet) నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమిస్తే, ఈ మొత్తం డబుల్ అయ్యే అవకాశం ఉంది. అంటే, ఆయన ఎంత కష్టపడి కంపెనీని ముందుకు నడిపిస్తే, ఆయన సంపాదన కూడా అంతే వేగంగా పెరుగుతుందన్నమాట. ఒకవేళ లక్ష్యాలు తప్పితే ఆ విలువ సున్నా అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇది రిస్క్ మరియు రివార్డ్ కలయికతో కూడిన ప్యాకేజీ.
అదేవిధంగా ఈసారి ఆల్ఫాబెట్ బోర్డు పిచాయ్‌కు ఒక ప్రత్యేక బాధ్యతను అప్పగించింది. కేవలం గూగుల్ సెర్చ్ ఇంజిన్ మాత్రమే కాకుండా, భవిష్యత్తును మార్చబోయే వేమో (Waymo) డ్రైవర్‌లెస్ కార్లు, వింగ్ (Wing) డెలివరీ డ్రోన్స్ వంటి ప్రాజెక్టుల బాధ్యతను ఆయన భుజాన వేసింది. వీటి కోసం ప్రత్యేకంగా 175 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ ప్రోత్సాహకాలను కేటాయించారు. ఈ వినూత్న టెక్నాలజీ రంగాల్లో పిచాయ్ నాయకత్వంపై బోర్డుకు ఎంతటి నమ్మకం ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాగా, 2015లో పిచాయ్ సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పుడు గూగుల్ మార్కెట్ విలువ 535 బిలియన్ డాలర్లు. నేడు అది ఏకంగా 3.6 ట్రిలియన్ డాలర్ల మైలురాయిని చేరుకుంది. దాదాపు ఏడు రెట్ల వృద్ధిని సాధించి పెట్టడంలో ఆయన పోషించిన పాత్ర అసామాన్యం. అందుకే మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల, యాపిల్ టిమ్ కుక్ వంటి దిగ్గజాల వార్షిక వేతనాల కంటే పిచాయ్ ప్యాకేజీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.