సాధారణ భక్తులు తిరుమల కొండపై అడుగుపెడితే.. గోవింద నామస్మరణతో పులకించిపోతారు. కానీ మన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన శిష్యురాలు దివ్వెల మాధురి మాత్రం కొండపైకి వెళ్తే చాలు.. కెమెరాలతో నానా హంగామా చేస్తారు. శ్రీవారి సన్నిధిలో క్రమశిక్షణతో ఉండాల్సింది పోయి, తాజాగా గెస్ట్‌హౌస్‌లను బర్త్‌డే పార్టీలకు అడ్డాగా మార్చేయడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. మరీ విచిత్రం ఏంటంటే, చేసిన తప్పును ఒప్పుకోకుండా, దానికి వారు ఇస్తున్న కలరింగ్ చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.
ఎగ్-లెస్ కేక్ అయితే రూల్స్ వర్తించవా?
తిరుమల మాడ వీధుల్లో గానీ, గెస్ట్‌హౌస్‌లలో గానీ వ్యక్తిగత వేడుకలు నిషిద్ధమని కనీస జ్ఞానం ఉన్న ఎవరికైనా తెలుస్తుంది. కానీ దువ్వాడకు మాత్రం, ``మేము కట్ చేసింది ఎగ్-లెస్ కేక్`` అని ఒక వితండవాదాన్ని తెరపైకి తెచ్చారు. అంటే గుడ్డు లేని కేక్ కట్ చేస్తే తిరుమల నిబంధనలు వర్తించవని వీరి భావన కాబోలు. తప్పు చేస్తే లెంపలేసుకోవాల్సింది పోయి, ఇలాంటి లాజిక్ లు మాట్లాడటం చూస్తుంటే.. వీరికి భక్తి కంటే తమ వింత చేష్టలను సమర్థించుకోవడమే ఎక్కువైందని అర్థమవుతోంది.
ఈ కేక్ కటింగ్ వ్యవహారంపై టీటీడీ అధికారులు స్పందించి కేసులు పెడితే, వెంటనే వీరు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిపై విమర్శలు మొదలుపెట్టారు. చైర్మన్ పై వచ్చిన వీడియోలు ఫేక్ అని కోర్టు తేల్చినా, వాటిని పట్టుకుని వేలాడుతూ.. ``ఆయన చేయగా లేనిది, మేము కేక్ కట్ చేస్తే తప్పా?`` అని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే.. చైర్మన్ పై ఆరోపణలకీ, వీరు తిరుమల పవిత్రతను దెబ్బతీయడానికీ సంబంధం ఏంటి? ఎవరో తప్పు చేశారని (అది కూడా నిరూపితం కాకపోయినా), తాము చేసే తప్పులను సమర్థించుకోవడం విడ్డూరంగా మారింది.
చట్టాన్ని గౌరవించాల్సిన ఎమ్మెల్సీ హోదాలో ఉండి, దేవుడి సన్నిధిలో అపచారం చేస్తూ దొరికిపోయినందుకు సిగ్గుపడాలి. కానీ, ఈ జంట మాత్రం వరుస వీడియోలు రిలీజ్ చేస్తూ మరింత రచ్చ చేస్తోంది. తిరుమల అంటే పవిత్ర క్షేత్రం అని మర్చిపోయి, అదొక షూటింగ్ స్పాట్ లాగా మార్చేయడం వీరికే చెల్లింది. మొత్తానికి, దువ్వాడ వారి కేక్ కటింగ్ కంటే, దాన్ని కవర్ చేయడానికి వారు పడుతున్న పాట్లు చూస్తుంటే.. ప్రజలకు మాత్రం అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ దొరుకుతోంది.