అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం సాక్షిగా మరో మహా సంగ్రామానికి తెరలేచింది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, అందని ద్రాక్షలా ఊరిస్తున్న టైటిల్ కోసం న్యూజిలాండ్‌తో రేపు అమీతుమీ తేల్చుకోబోతుంది. అయితే, ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు కేవలం ప్రత్యర్థి జట్లే కాదు.. వరుణ దేవుడు కూడా సవాలు విసిరే అవకాశం ఉందన్న వార్తలు ఫ్యాన్స్‌లో టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ నిలిచిపోతే ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి? విజేతను ఎలా తేలుస్తారు?
ఐసీసీ నిబంధనల ప్రకారం, ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌ల్లో ఫలితం తేలాలంటే ఇరు జట్లు కనీసం 10 ఓవర్ల చొప్పున ఆడాల్సి ఉంటుంది. సాధారణంగా గ్రూప్ స్టేజ్ మ్యాచుల్లో 5 ఓవర్లు ఆడితే సరిపోతుంది, కానీ ఫైనల్‌కు మాత్రం రూల్ మార్చారు. వర్షం వస్తే మ్యాచ్ పూర్తి చేయడానికి అదనంగా 120 నిమిషాల (2 గంటలు) సమయాన్ని కేటాయిస్తారు. ఈ లోపు వాన తగ్గి ఆట సాధ్యపడితే ఓవర్లు తగ్గించి అయినా విజేతను నిర్ణయిస్తారు.
రిజర్వ్ డే.. ఆగిపోయిన చోటు నుంచే!
నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా ఆదివారం ఆట సాధ్యం కాకపోతే, మ్యాచ్‌ను మార్చి 9 (సోమవారం) రిజర్వ్ డే రోజున నిర్వహిస్తారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. రిజర్వ్ డే నాడు మ్యాచ్ మళ్లీ మొదటి నుండి ప్రారంభం కాదు. ఆదివారం ఎక్కడైతే ఆగిపోయిందో, సోమవారం అక్కడి నుంచే ఆట మొదలవుతుంది. అంటే టాస్ వేసి ఒక బంతి పడ్డాక వర్షం వచ్చినా.. మరుసటి రోజు ఆ ఒక్క బంతి తర్వాత నుంచే కంటిన్యూ చేస్తారు.
క్రికెట్ ప్రేమికులు అస్సలు ఇష్టపడని సీన్ ఇది. ఒకవేళ రిజర్వ్ డే రోజు కూడా వరుణుడు శాంతించకుండా మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే.. ఐసీసీ వద్ద మరో దారి లేదు. అప్పుడు భారత్ మరియు న్యూజిలాండ్ జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. ట్రోఫీని ఇరు జట్లు పంచుకోవాల్సి ఉంటుంది. 2002 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-శ్రీలంక మధ్య సరిగ్గా ఇలాగే జరిగింది. అప్పుడు రెండు రోజులు వర్షం పడటంతో ఇరు జట్లకు కప్పును షేర్ చేశారు.
ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం.. క్రికెట్ అభిమానులకు ఇది తీపి కబురే. రేపు అహ్మదాబాద్ ఆకాశం నిర్మలంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వర్షం ముప్పు దాదాపు సున్నా శాతమే. అయితే, వాన కంటే ఎండ సెగలే ఆటగాళ్లను ఇబ్బంది పెట్టనున్నాయి. మధ్యాహ్నం ఉష్ణోగ్రత 40°C దాటే అవకాశం ఉండటంతో, ఫిట్‌నెస్ ఈ మ్యాచ్‌లో కీలకం కానుంది.