‘నా అన్వేషణ’ (naa anveshana) పేరుతో చాలా ఏళ్ల నుంచి యూట్యూబ్ ఛానెల్ నడుపుతూ ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్లలో మంచి పాపులారిటీ సంపాదించాడు అన్వేష్(anvesh). తనను తాను ప్రపంచ యాత్రికుడిగా పరిచయం చేసుకుంటూ అతను ఎన్నో దేశాలు తిరిగాడు. ఆ దేశాల సంఖ్య 150కి చేరువ అవుతుండడం విశేషం. యూట్యూబ్‌లో అతడి ఛానెల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 2.5 మిలియన్లకు చేరువ అయింది.
కానీ గత కొన్ని వారాల వ్యవధిలో ఆ నంబర్ కాస్తా 2.17 మిలియన్లకు పడిపోయింది. ఒక వీడియోలో హిందూ దేవతలను అవమానించేలా అతను వ్యాఖ్యలు చేశాడనే కారణంతో ఆ వర్గం వాళ్లు అతణ్ని అన్ ఫాలో చేయడం మొదలుపెట్టారు. బీజేపీ మద్దతుదారులు అతణ్ని గట్టిగానే టార్గెట్ చేశారు.
అతడి మీద పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. అన్వేష్ కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు(look out notice) సైతం జారీ చేయడం చర్చనీయాంశం అయింది. అతణ్ని త్వరలోనే ఇండియాకు రప్పిస్తారని.. వచ్చాక ఈ కేసుల తలనొప్పి అతడికి మామూలుగా ఉండదనే చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో అన్వేష్ స్పందించాడు. తాను ఇప్పట్లో ఇండియాకు రానని అంటూనే.. వస్తే తననేమైనా ఉరి తీస్తారా, అసలు నేనేం తప్పు చేశానని అతను ప్రశ్నించాడు. తనకు వివిధ దేశాల్లో తిరగడానికి 2035 వరకు పాస్ట్ పోర్టుల అనుమతి ఉందని.. కాబట్టి తాను అప్పటిదాకా ఇండియాకు రావాల్సిన అవసరం లేదని అతను చెప్పాడు. తన తల్లిదండ్రులు స్వర్గానికి టికెట్ వేసుకోవడానికి రెడీగా ఉన్నారని కూడా అతను వ్యాఖ్యానించాడు. అసలు తాను చేసిన తప్పేంటో తేల్చాలని అతనన్నాడు. తాను హిందూ ధర్మం మీద, ఆలయాలు, దేవుళ్ల మీద ఎన్నో మంచి వీడియోలు చేశానన్నాడు. రూ.80 లక్షల సాయం అందించానని, ఇంకా ఎన్నో మంచి పనులు చేశానని చెప్పాడు. తాను ఇండియాకు వచ్చినా సరే.. పోలీసులు ఏమని అరెస్టు చేస్తారు.. తానసలు ఏం తప్పు చేశాను అని అన్వేష్ ప్రశ్నించాడు. తనకు చట్టం తెలుసని.. సుప్రీం కోర్టులో పని చేసేవాళ్లే కాక ముగ్గురు నలుగురు లాయర్లు అందుబాటులో ఉన్నారని.. తన మీద పెట్టినవన్నీ చిన్న చిన్న కేసులని చెబుతూ, ప్రశాంతంగా ఉండమని చెప్పారని.. కాబట్టి తాను ఏమాత్రం టెన్షన్ పడట్లేదని చెప్పాడు. తనను టార్గెట్ చేస్తున్న బత్తాయిలను సులువుగా వదిలిపెట్టనని.. ఈ ఏడాదంతా వాళ్లను టార్గెట్ చేస్తూ వీడియోలు పెడుతూనే ఉంటానని.. బత్తాయిలను పిండడమే తనకు పని అని అతను పేర్కొన్నాడు.