రాష్ట్రంలో ఎక్కడైనా కన్నీటి చప్పుడు వినిపిస్తే చాలు.. తాడేపల్లి ప్యాలెస్‌లో కెమెరాలు క్లీన్ అవుతాయి, డ్రోన్ షాట్లు సిద్ధమవుతాయి. తాజాగా వేట్లపాలెం బాణసంచా ప్రమాదం జగన్ రెడ్డికి మరో పొలిటికల్ పిక్నిక్ కు వేదికగా మారబోతోంది. బాధిత కుటుంబాల గుండెల్లో ఆరని చిచ్చు రగులుతుంటే, ఆ మంటల సాక్షిగా తన రాజకీయ బలాన్ని కొలుచుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి సిద్ధమయ్యారు. అందుకే ఎప్పటిలా బుధవారం వరకు ఆగకుండా, ఈసారి సోమవారమే కన్నీళ్ల వేటకు బెంగళూరు నుంచి ల్యాండ్ అవుతున్నారు.
జగన్ రెడ్డి పరామర్శల తీరు ఎప్పుడూ ఒకే ఫార్మాట్‌లో సాగుతుంది. బాధితులతో గడిపేది కేవలం ఐదు నిమిషాలే, కానీ ఆ ఐదు నిమిషాల కోసం చేసే హంగామా మాత్రం ఊరు వాడ ఏకం చేసేలా ఉంటుంది. వందల వాహనాల కాన్వాయ్, వేలమంది కార్యకర్తల సమీకరణ, అడుగడుగునా ఫ్లెక్సీల జాతర.. ఇది పరామర్శ యాత్రలా కాకుండా, ఏదో ఎన్నికల ప్రచార ర్యాలీని తలపిస్తోంది. బాధిత కుటుంబాల వద్ద ఉండాల్సింది మౌనం మరియు సంతాపం.. కానీ జగన్ గారి పర్యటనల్లో కనిపిస్తున్నవి మాత్రం పూల వర్షాలు, ఈలలు, కేకలు. దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చడానికి వెళ్తూ.. ఇంతింత బిల్డప్ అవసరమా అన్నది సగటు మనిషి ప్రశ్న.
నిజంగానే బాధితుల పట్ల ప్రేమ ఉంటే, సైలెంట్‌గా వెళ్లి ఆర్థిక సాయం అందించి రావొచ్చు. కానీ జగన్ రెడ్డి మార్కు పరామర్శలో ‘కెమెరా యాంగిల్’ సరిగ్గా లేకపోతే అది పరామర్శే కాదు. సోషల్ మీడియాలో భారీ ఎలివేషన్లు, స్లో-మోషన్ షాట్ల కోసం తాపత్రయపడే బ్యాచ్ అంతా ఇప్పటికే వేట్లపాలెం పరిసరాల్లో తిష్ట వేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ఏ ఒక్క వైసీపీ నేత ముఖం చూపించలేదు కానీ, ఇప్పుడు జగన్ వస్తున్నారంటే మాత్రం ప్రదర్శన కోసం క్యూ కడుతున్నారు.
ఒకపక్క ప్రభుత్వం బాధితులకు సహాయక చర్యలు అందించడంలో నిమగ్నమై ఉంటే, జగన్ పవర్ షో కోసం సెక్యూరిటీ కల్పించడం పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. రోడ్ల దిగ్బంధం, ట్రాఫిక్ మళ్లింపులతో స్థానిక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరామర్శ పాలిటిక్స్ వల్ల బాధితులకు వచ్చే లాభం కంటే, సామాన్యులకు కలిగే ఇబ్బందే ఎక్కువగా ఉంది. ఇప్పటికైనా కెమెరా ఫోకస్ కంటే.. బాధితుల కన్నీళ్లపై ఫోకస్ పెడితే బెటర్ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.