వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఒక కీలక మార్పుపై గట్టి చర్చ నడుస్తోంది. పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆరోగ్య కారణాలతో క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యే సూచనలు కనిపిస్తుండటంతో, శాసనమండలిలో వైసీపీ పక్ష నేత పదవి ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం బోత్స బ్రెయిన్ స్ట్రోక్‌తో హైదరాబాద్‌లో చికిత్స పొందుతుండటంతో, ఆయనపై పని భారం తగ్గించాలని కుటుంబ సభ్యులు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కోరినట్లు సమాచారం.
అసెంబ్లీలో వైసీపీకి తగిన సంఖ్యాబలం లేని ప్రస్తుత తరుణంలో, శాసనమండలిలో పార్టీ గొంతుకను బలంగా వినిపించే బాధ్యతను జగన్ బొత్సకు అప్పగించారు. అయితే, గతంలో ఒకసారి సభలోనే స్పృహ తప్పి పడిపోవడం, ఇప్పుడు మళ్లీ అస్వస్థతకు గురికావడంతో ఆయన ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది. ఈ క్రమంలోనే మండలిలో సమర్థవంతంగా ప్రభుత్వంపై పోరాడే కొత్త నాయకత్వం కోసం జగన్ అన్వేషణ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

రేసులో `ఆమె` పేరు ఎందుకు ముందంజలో ఉంది?
మండలి పక్ష నేత పదవి కోసం లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, పివిపి సూర్యనారాయణ రాజు వంటి సీనియర్ల పేర్లు వినిపిస్తున్నప్పటికీ, అందరి దృష్టి వరుదు కళ్యాణిపైనే ఉంది. ఉత్తరాంధ్రాకు చెందిన ఈమె, మండలిలో ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. విధానపరమైన అంశాల్లో అధికార పక్షాన్ని ఇరికించడంలో ఆమెది అందె వేసిన చేయి. అదే సమయంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో, వరుదు కళ్యాణికి ఈ పదవి ఇవ్వడం ద్వారా అటు మహిళలకు, ఇటు వెనుకబడిన తరగతులకు పెద్దపీట వేసినట్లు అవుతుందని జగన్ భావిస్తున్నారు. పైగా బొత్స కూడా ఉత్తరాంధ్ర నేత కావడంతో, అదే ప్రాంతానికి చెందిన మరో బలమైన నేతకు అవకాశం ఇస్తే పార్టీ పట్టును కాపాడుకోవచ్చనేది జగన్ వ్యూహం. వైసీపీ ఎమ్మెల్సీలలో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న వరుదు కళ్యాణికి ఈ బాధ్యతలు అప్పగిస్తే, మండలిలో పార్టీ వాయిస్ మరింత దూకుడుగా ఉంటుందని క్యాడర్ కూడా భావిస్తోంది. మరి త్వరలోనే రానున్న అధికారిక ప్రకటనలో జగన్ ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాలి.