ఏపీ శాసనమండలి(AP Legislative Council) వేదికగా గురువారం నాడు అమానవీయ దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సభ కాస్తా.. వైసీపీ సభ్యుల వీరంగంతో రణరంగంగా మారింది. చైర్మన్‌పై ఉన్న కోపాన్ని ఇతర పార్టీల సభ్యులపై చూపిస్తూ వైసీపీ ఎమ్మెల్సీలు చేసిన హంగామా చూస్తుంటే, వీరు సభకు వచ్చింది ప్రజా సమస్యల కోసమా లేక కొట్లాటల కోసమా అన్న అనుమానం కలగక మానదు. ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై దాడికి ప్రయత్నించడం మండలి చరిత్రలోనే ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది.
అసలు వివాదం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై వచ్చిన ప్రశ్నతో మొదలైంది. ఈ ప్రాజెక్టుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రి అప్పటికే సభలో కూలంకషంగా సమాధానం ఇచ్చారు. సమాధానం పూర్తయ్యాక, నిబంధనల ప్రకారం మండలి చైర్మన్ తదుపరి ప్రశ్నకు వెళ్లారు. అయితే, అక్కడే వైసీపీ(YCP) సభ్యులు తమ అసలు రంగు బయటపెట్టారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ``రాయలసీమ ప్రాజెక్టును ఆపించాం`` అని చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం ఇప్పుడే ప్రకటన చేయాలంటూ మొండికేసి కూర్చున్నారు.
ఒక ప్రశ్నకు సమాధానం పూర్తయిన తర్వాత దానిపై మళ్లీ చర్చ ఉండదని చైర్మన్ స్పష్టంగా చెప్పినా వైసీపీ సభ్యులు వినలేదు. నిబంధనలను బేఖాతరు చేస్తూ వైసీపీ సభ్యులు మొండికేయడం వారి సైకోయిజానికి పరాకాష్ట. ఈ క్రమంలోనే చైర్మన్ అనుమతితో సోము వీర్రాజు(Somu Veerraju) తన ప్రశ్న అడిగేందుకు ప్రయత్నించగా.. వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ మరికొందరు సభ్యులతో కలిసి ఆయనపైకి దూసుకెళ్లారు. ఒక గౌరవప్రదమైన సభలో ఉన్నామనే కనీస స్పృహ లేకుండా, భౌతిక దాడికి దిగడం అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైసీపీ సభ్యులు సోము వీర్రాజును చుట్టుముట్టి దాడి చేసే లోపే.. హోంమంత్రి అనితతో పాటు ఇతర టీడీపీ సభ్యులు ఆయనకు రక్షణగా నిలబడ్డారు. సభలో మహిళా మంత్రి అనిత(Vangalapudi Anitha) ధైర్యంగా నిలబడి వైసీపీ సభ్యులను అడ్డుకున్న తీరు చర్చనీయాంశమైంది. చివరకు పరిస్థితి చేయి దాటిపోవడంతో చైర్మన్ సభను వాయిదా వేయాల్సి వచ్చింది. ఓటమి భారంతోనో లేదా ఉనికిని చాటుకోవాలనే ఆరాటంతోనో గానీ.. వైసీపీ సభ్యులు చేస్తున్న ఇటువంటి వీధి పోరాటాలు సభ గౌరవాన్ని మంటగలుపుతున్నాయని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు.