రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమే కానీ.. అప్పుడప్పుడు వచ్చే సెటైర్లు మాత్రం రాజకీయ వేడిని ఒక్కసారిగా పెంచేస్తుంటాయి. తాజాగా ఏపీ మంత్రి నారా లోకేశ్, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేవలం రాజకీయ విమర్శలే కాకుండా, ఏకంగా ఒక బంపర్ ఆఫర్ ప్రకటించి లోకేశ్ అందరినీ ఆశ్చర్యపరిచారు.
గతంలో నారా లోకేశ్ శ్రీలంకకు వెళ్లి క్రికెట్ మ్యాచ్ చూడటంపై జగన్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేసిన లోకేశ్, తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ``క్రికెట్ మ్యాచ్ చూడటానికి స్టేడియంకు వెళ్లకూడదా? టీమిండియా టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరితే నేను కచ్చితంగా చూసేందుకు వెళ్తాను. నా సొంత డబ్బులతోనే టికెట్ కొనుక్కుంటాను. ఆయన(జగన్)కి కూడా నా ఖర్చులతోనే ఒక టికెట్ కొనిస్తాను, రమ్మనండి`` అంటూ లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
కేవలం క్రికెట్ టికెట్ దగ్గరే ఆగకుండా, ఆర్థిక అంశాలపైనా లోకేశ్ విరుచుకుపడ్డారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్‌కు చెందిన సాక్షి మీడియాకు, భారతి సిమెంట్స్ కు దాదాపు రూ.1,000 కోట్ల మేర అడ్డగోలుగా లబ్ధి చేకూర్చారని ఆయన ఆరోపించారు. తమ కుటుంబ సంస్థ హెరిటేజ్‌కు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ప్రయోజనం అందలేదు. కానీ జగన్ తన సంస్థలకు మాత్రం వేల కోట్లు దోచిపెట్టారని మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా హెరిటేజ్‌పై సెబీకి ఫిర్యాదు చేయడం హాస్యాస్పదమని, వైసీపీ నాయకులు బురదజల్లే రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.