ఏపీ ఎమ్మెల్యేల క్రికెట్ హంగామా.. కెప్టెన్లు ఫిక్స్!

admin
Published by Admin — February 23, 2026 in Politics, Andhra
News Image

రాష్ట్ర రాజకీయాల్లో నిత్యం ప్రజా సమస్యలు, విమర్శలు, ప్రతివిమర్శలతో హీటెక్కించే ఏపీ నేతలు.. ఇప్పుడు కాసేపు వైట్ అండ్ వైట్ డ్రస్సులకు ప్యాకప్ చెప్పేసి, స్పోర్ట్స్ జెర్సీలు తొడగనున్నారు. అసెంబ్లీలో వాడీవేడి చర్చలతో హోరెత్తించే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పుడు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా బ్యాట్, బాల్‌తో సత్తా చాటబోతున్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు సాగే ఈ క్రీడా సంబరం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ క్రీడా పోటీల్లో అందరి కళ్ళు క్రికెట్ మ్యాచ్‌లపైనే ఉన్నాయి. ఇప్పటికే రెండు జట్లు సిద్ధం కాగా, ఒక జట్టుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. మరో టీమ్‌ను పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నడిపించబోతున్నారు. రాజకీయ వ్యూహాలతో ప్రత్యర్థులను ఇరుకున పెట్టే ఈ ఇద్దరు నేతలు.. ఇప్పుడు క్రికెట్ పిచ్‌పై ఎలాంటి ఫీల్డింగ్ సెట్ చేస్తారు? బ్యాట్‌తో ఎలా మెరుస్తారు? అన్నది చూడటం ఆసక్తికరంగా మారింది.

ఈ టోర్నీలో అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. క్రికెట్ ఆడేందుకు ఎమ్మెల్యేల నుంచి విపరీతమైన పోటీ కనిపిస్తోంది. ఒకవేళ సభ్యుల సంఖ్య పెరిగితే మూడో జట్టును కూడా రంగంలోకి దించేలా ప్లాన్ చేస్తున్నారు. అదే జరిగితే, ఆ మూడో టీమ్‌కు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ పవన్ కళ్యాణ్ గనుక బ్యాట్ పట్టి గ్రౌండ్‌లోకి దిగితే, ఆ హంగామా మామూలుగా ఉండదని ఫ్యాన్స్ ఇప్పుడే సోషల్ మీడియాలో రచ్చ మొదలుపెట్టారు.

ఈ పోటీల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. పాల్గొనే ప్రజాప్రతినిధులందరికీ ఉచితంగా టీ-షర్టులు, ట్రాకర్లను అందజేయనున్నారు. కేవలం క్రికెట్ మాత్రమే కాదు.. చెస్, క్యారమ్స్, టెన్నిస్ వంటి ఆటల్లోనూ నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ప్రతిరోజూ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఈ ఆటల సందడి మొదలవుతుంది. చట్టసభల్లో గంభీరంగా కనిపించే నేతలు, మైదానంలో క్రీడాస్ఫూర్తితో ఒకరినొకరు పలకరించుకోవడం ఆరోగ్యకరమైన పరిణామమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags
AP MLA Cricket Vijayawada Nara Lokesh Pawan Kalyan Nadendla Manohar AndhraPradesh
Recent Comments
Leave a Comment

Related News