టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజేష్ కిలారు గురించి టీడీపీ నేతలకు పరిచయం అక్కర్లేదు. ఐటీ శాఖా మంత్రి, యువనేత నారా లోకేష్ క్లాస్మేట్, అత్యంత సన్నిహితుడు రాజేష్. పార్టీలో చేరిన అనతి కాలంలోనే కీలక నేతగా గుర్తింపు పొందిన రాజేష్ కు మరింత గుర్తింపు దక్కే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే రాజేష్ కిలారును పెద్దల సభకు పంపాలని ఏపీ సీఎం చంద్రబాబు గట్టిగా ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. త్వరలోనే ఏపీలో ఖాళీ కాబోతున్న 4 రాజ్యసభ స్థానాల్లో ఒకటి రాజేష్ కిలారుకు కన్ఫర్మ్ అయిందని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
విజయవాడలో చార్టర్డ్ అకౌంటెంట్ కుటుంబానికి చెందిన రాజేష్ కిలారు హైదరాబాద్ లోని భారతీయ విద్యా భవన్ లో లోకేష్‌తో కలిసి చదివారు. అప్పటి నుంచి లోకేష్ తో స్నేహాన్ని కొనసాగిస్తున్న రాజేష్...ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి లోకేష్ సన్నిహిత సలహాదారుడిగా అంచెలంచెలుగా ఎదిగారు.
హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసి, ఆ తర్వాత అమెరికాలోని రాబర్ట్ మోరిస్ యూనివర్సిటీ నుండి రాజేష్ మాస్టర్స్ డిగ్రీ పొందారు. 2023లో నారా లోకేష్ చేపట్టిన 3,132 కిలోమీటర్ల సుదీర్ఘ యువగళం పాదయాత్రను రాజేష్ దగ్గరుండి పర్యవేక్షించారు. 2024లో కూటమి విజయంలో టీడీపీ తరఫున రాజేష్ కీలకంగా మారి తనవంతు పాత్ర పోషించారు.
వైసీపీ హయాంలో రాజేష్ ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారు. రాజేష్ ను సీఐడీ అధికారులు విచారణ జరిపారు. అయితే, ఏ తప్పూ చేయని రాజేష్ నిర్భయంగా విచారణను ఎదుర్కొన్నారు. రాజేష్ కు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఇక, చంద్రబాబును తప్పుడు కేసుల్లో జైల్లో పెట్టినప్పుడు లోకేష్ కు జాతీయస్థాయిలో మద్దతు సమీకరించడంలో కూడా రాజేష్ కిలారు కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే రాజేష్ కిలారును రాజ్యసభకు పంపి సముచిత గౌరవం ఇవ్వాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారని తెలుస్తోంది. త్వరలోని ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.