అమరావతి: గత కొద్దిరోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకే పరిమితమైన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు ఎట్టకేలకు ఊరట లభించింది. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపిన సంక్రాంతి లక్కీ డ్రా కేసులో గుంటూరు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో దాదాపు మూడు వారాలుగా సాగుతున్న ఆయన జైలు వాసానికి తెరపడనుంది.
జనవరి 31 నుంచి రిమాండ్‌లో ఉన్న అంబటిని కస్టడీలోకి తీసుకుని విచారించాలని పోలీసులు వేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ఇప్పటికే రెండు వేర్వేరు కేసుల్లో బెయిల్ పొందిన అంబటిపై, చివరి నిమిషంలో ఈ లక్కీ డ్రా కేసులో పీటీ వారెంట్ జారీ కావడంతో ఆయన విడుదల వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా ఈ కేసులోనూ బెయిల్ రావడంతో, ఆయన జైలు నుంచి బయటకు రావడం ఇప్పుడు లాంఛనమే అయింది. అంబటి రాంబాబు విడుదల వార్త తెలియగానే వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు కార్యకర్తలు సిద్ధం అవుతున్నారు.
ఏమిటీ లక్కీ డ్రా కేసు?
2023 సంక్రాంతి సందర్భంగా సత్తెనపల్లిలో నిర్వహించిన లక్కీ డ్రాలో అవకతవకలు జరిగాయంటూ ఓ జనసేన నాయకుడు ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం మొదలైంది. ఈ కేసులో అంబటి పాత్ర ఉందన్న ఆరోపణలతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనపై అక్రమ కేసులు బనాయించారని అంబటి వర్గీయులు మొదటి నుంచి వాదిస్తున్నారు.