ట్రంప్‌తో మోదీ బిగ్ డీల్.. ఇక భారత్‌లో ఉద్యోగాల జాతరే జాత‌ర‌!

admin
Published by Admin — February 07, 2026 in National, International
News Image

న్యూఢిల్లీ: భారత్-అమెరికా సంబంధాల్లో సరికొత్త శకం మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య కుదిరిన తాత్కాలిక వాణిజ్య ఒప్పందం దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేయబోతోంది. ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ భారీ డీల్‌పై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేస్తూ, ఇది భారత్‌కు `గ్రేట్ న్యూస్` అని అభివర్ణించారు. ముఖ్యంగా అమెరికా విధించిన భారీ సుంకాలను సగానికి పైగా తగ్గించడం ఈ ఒప్పందంలో హైలైట్‌గా నిలిచింది.

ఇప్పటివరకు అమెరికాకు వెళ్లే భారతీయ ఉత్పత్తులపై ఉన్న 50 శాతం సుంకాలను ఏకంగా 18 శాతానికి తగ్గిస్తూ వాషింగ్టన్ కీల‌క నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణ‌యంతో భారతీయ వస్తువులు అమెరికా మార్కెట్‌లో చౌకగా లభించడమే కాకుండా, చైనా వంటి దేశాలతో పోటీపడి మన వ్యాపారం విస్తరించడానికి అవకాశం ఏర్పడింది. దీనికి ప్రతిగా అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులకు భారత్ అంగీకరించింది. ఈ డీల్ వల్ల భారత ఎగుమతిదారులకు ఏకంగా 30 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ తలుపులు తెరుచుకున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.

ఎవరెవరికి లాభం?
ఈ డీల్ తో దేశంలో ఉపాధి అవకాశాలు వెల్లువెత్తనున్నాయి. అమెరికా మార్కెట్ నుండి వచ్చే డిమాండ్‌ను అందుకోవడానికి భారత్‌లో తయారీ రంగాలు ఊపందుకుంటాయి. దీనివల్ల `మేక్ ఇన్ ఇండియా` లక్ష్యం మరింత బలోపేతం కావడమే కాకుండా, గ్రామీణ యువతకు, మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుంది. ముఖ్యంగా ఐటీ, ఎంఎస్ఎంఈ, స్టార్టప్ రంగాల్లో పనిచేసే వారికి ఈ ఒప్పందం ఒక వరంగా మారబోతోంది. కేవలం ఐటీ, పరిశ్రమలే కాకుండా.. ఈ ఒప్పందం వల్ల మన అన్నదాతలకు కూడా భారీ మేలు జరగనుంది. భారతీయ వ్యవసాయ ఉత్పత్తులు, సముద్ర ఆహారం అమెరికా వంటి అగ్ర‌దేశాల‌కు సులభంగా ఎగుమతి కానున్నాయి. ఫ‌లితంగా మత్స్యకారులకు, రైతులకు గిట్టుబాటు ధర లభించడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో మన ఆహార ఉత్పత్తులకు గుర్తింపు లభిస్తుంది.

ట్రంప్‌కు మోదీ స్పెషల్ థాంక్స్!
ఈ చారిత్రాత్మక విజయం నేపథ్యంలో ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా డొనాల్డ్ ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపారు. ``ఇరు దేశాల మధ్య పెరుగుతున్న నమ్మకానికి ఈ ఒప్పందమే నిదర్శనం. వ్యక్తిగత నిబద్ధతతో కృషి చేసిన ట్రంప్‌కు కృతజ్ఞతలు`` అని మోదీ పేర్కొన్నారు. కాగా, ఈ డీల్ కేవలం వ్యాపారం మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో భారత్‌ను గ్లోబల్ ఎగుమతుల హబ్‌గా మార్చే వ్యూహాత్మక అడుగు అని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags
India US Trade Deal Modi Trump Make In India Indian Economy India America
Recent Comments
Leave a Comment

Related News