అనంతపురం: రాజకీయాల్లో గెలుపోటములు సహజం.. కానీ ప్రత్యర్థిని దెబ్బతీయడానికి క్షుద్రపూజల బాట పట్టడం ఇప్పుడు అనంతపురం జిల్లాలో పెను సంచలనంగా మారింది. శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద గత కొంతకాలంగా జరుగుతున్న వింత ఘటనలు చూస్తుంటే, ఆమెను రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా దెబ్బతీయాలని ఎవరో గట్టిగానే ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. తాజాగా అర్ధరాత్రి వేళ ఎమ్మెల్యే ఇంటి ముందు జరిగిన సీన్ చూసి అనుచరులు, కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు.
గత కొన్ని నెలలుగా ఎమ్మెల్యే శ్రావణి కుటుంబ సభ్యులు వరుసగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే, తాజాగా ఓ స్విఫ్ట్ కారులో వచ్చిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఎమ్మెల్యే ఇంటి గేటు ముందు నిమ్మకాయలు, తెల్ల నువ్వులు చల్లి వెళ్లడం కలకలం రేపింది. ఆ సమయంలో అక్కడ కాపలా ఉన్న అనుచరులు ఇది గమనించి వారిని వెంబడించగా.. దుండగులు కారును స్పీడ్‌గా నడుపుతూ అక్కడి నుంచి పరారయ్యారు. అయితే చాకచక్యంగా వ్యవహరించిన ఎమ్మెల్యే వర్గీయులు ఆ కారు నంబర్‌ను (AP 39 KX 0986) గుర్తించారు.
ఈ వికృత చేష్టల వెనుక రాజకీయ కుట్ర ఉందనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా శింగనమల నియోజకవర్గానికి చెందిన ఓ అసమ్మతి నేత, ఎమ్మెల్యే శ్రావణి ఎదుగుదలను ఓర్చుకోలేకే ఇలాంటి క్షుద్రపూజలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే వర్గీయులు నేరుగానే ఆరోపిస్తున్నారు. రాజకీయంగా ధైర్యంగా ఎదుర్కోలేక, ఇలాంటి చీకటి మార్గాలను ఎంచుకోవడంపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
మరోవైపు ఈ ఘటనపై అనంతపురం టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కారు నంబర్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నారు. ఎమ్మెల్యే ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీని ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఇది కేవలం భయపెట్టడానికి చేసిన పనా లేక దీని వెనుక ఎవరి హస్తమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.