ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి రాజుకుంది. మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై జరిగిన దాడి రాజకీయంగా పెను సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన్ను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ మంత్రి రోజా, కూటమి ప్రభుత్వంపై తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ హస్తం ఉందని ఆమె నేరుగా ధ్వజమెత్తారు.
తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన రచ్చ అంతా తెలిసిందే. అయితే, ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ఆశించిన మైలేజ్ రాకపోగా, సీబీఐ నివేదికతో అసలు విషయం బయటపడిందని రోజా విమర్శించారు. లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని, అయోధ్యకు పంపిన లడ్డూలు కూడా స్వచ్ఛమైనవేనని తేలడంతో.. ఆ అపవాదు నుంచి తప్పించుకోవడానికే చంద్రబాబు దారి మళ్ళించే రాజకీయాలకు తెరలేపారని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలోనే వైసీపీ కీలక నేతలపై భౌతిక దాడులకు ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. లడ్డూ విషయంలో హిందూ భక్తులను ఆందోళనకు గురి చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలని రోజా డిమాండ్ చేశారు.
18 నెలల వేధింపులు.. బాహుబలి క్లైమాక్స్ గుర్తుందా?
గత 18 నెలలుగా జోగి రమేష్ కుటుంబాన్ని ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వేధిస్తోందని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఆయన భార్య, కుమారుడిపై పెట్టిన కేసులే ఇందుకు నిదర్శనమని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆమె `బాహుబలి` సినిమాను ఉదహరిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ``భల్లాలదేవుడు ఎన్ని కుతంత్రాలు చేసి సింహాసనాన్ని అధిష్టించినా, ప్రజలు మాత్రం బాహుబలి వైపే ఉన్నారు. అదే విధంగా, ఈ కూటమి సర్కార్ ఎన్ని కుట్రలు చేసినా, చివరకు నిజాయితీ, నిబద్ధత ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైపే ప్రజలు నిలుస్తారు`` అని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
చంద్రబాబును, లోకేష్‌ను విమర్శించిన ప్రతి ఒక్కరి ఇంటిపై రాళ్లు రువ్వడం, పెట్రోల్ పోసి తగలబెట్టాలనుకోవడం అనాగరికమని రోజా మండిపడ్డారు. ``గతంలో ప్రధాని మోదీని చంద్రబాబు, బాలకృష్ణలు బహిరంగంగానే ఇష్టానుసారం తిట్టారు. మరి ఇప్పుడు వారి ఇళ్లను ఏం చేయాలి?`` అని ఆమె సూటిగా ప్రశ్నించారు. టీడీపీ శ్రేణులు బరితెగించి దాడులు చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని, ఇది రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణతకు అద్దం పడుతోందని ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు.