చంద్రహాస్ పై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు

admin
Published by Admin — February 05, 2026 in Movies
News Image

ఎదగాలన్న తపన.. కోరిక మెండుగా ఉంటే సరిపోతుందా? అందుకు తగ్గట్లుగా కష్టపడాలి. కష్టపడిన వేళ.. సరైన ఫలితం రాకుంటే.. మరింత కష్టపడాలి.. విజయాన్ని సొంతం చేసుకోవాలి. అందుకు భిన్నంగా నెగిటివ్ పబ్లిసిటీతో నోటికి వచ్చినట్లుగా మాట్లాడేసి.. దాంతో ఇమేజ్ పెంచుకోవాలనుకునే ప్రయత్నం సరైనదేనా? నలుగురి ముందు మర్యాద అన్నది ఇసుమంత కూడా లేకుండా.. ఊగిపోతూ ఇష్టారాజ్యంగా వాడేసిన పదాల్ని ప్రశ్నిస్తూ.. వీడియో చేస్తూ.. కాస్తంత కోపంతో ప్రశ్నిస్తే.. స్పందించాల్సిన తీరు ఎలా ఉండాలి? అన్నప్పుడు.. కచ్ఛితంగా నటుడు చంద్రహాస్ తీరు మాదిరి ఉండకూదని ఎవరైనా చెబుతారు.

కానీ.. అతడి తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఇంతకూ ఈ నటుడు ఎవరంటారా? బుల్లితెర నటుడు ప్రభాకర్ కొడుకు కం సినీ హీరోగా చెప్పే నటుడు చంద్రహాస్. ఇతడిపై తాజాగా మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇన్ స్పెక్టర్ క్రిష్ణమోహన్ వెల్లడించిన వివరాల ప్రకారం చంద్రహాస్ హీరోగా నటించిన బరాబర్ ప్రేమిస్తా మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ హైరదరాబాద్ లో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈ సినిమాలోని పాటకు కొన్ని అభ్యంతరకర (దారుణం అంటే బాగుంటుందేమో) పదాల్ని జోడిస్తూ స్టేజ్ మీద పాడిన తీరుపై పెద్ద ఎత్తున ఖండనలు వ్యక్తమయ్యాయి. చివరకు ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరైన సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి సైతం తప్పు పట్టటమే కాదు.. ఆ మాటల్ని తాను ఎంజాయ్ చేశానంటూ వస్తున్న ప్రచారానికి వివరణ ఇస్తూ.. తాను ఆ పదాల్ని విన్నంతనే అక్కడి నుంచి లేచి వచ్చేద్దామని అనుకున్నట్లుగా పేర్కొంటూ ఈ పదాల్ని వాడటం ఏ మాత్రం మర్యాద కాదన్న విషయాన్ని తెలుపుతూ వీడియో చేశారు.

చంద్రహాస్ చేష్టల్ని సోషల్ మీడియాలో పలువురు తీవ్రంగా ఖండించటం తెలిసిందే. ఇదే తరహాలో బిగ్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా పని చేస్తున్న అశోక్ కుమార్ ఫేస్ బుక్ లో తన వ్యక్తిగత హోదాలో ఒక వీడియోను పోస్టు చేసి.. తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనిపై చంద్రహాస్ స్పందిస్తూ.. తనకు 24 గంటల్లో అశోక్ సారీ చెప్పాలని.. లేకుంటే అతడి సంగతి చూసుకుంటానంటూ వార్నింగ్ ఇచ్చిన వైనం.. ఆ సందర్భంగా అతను పోస్టు చేసిన వీడియో ఇప్పుడుమరో వివాదంగా మారింది. తాను వాడిన దారుణ పదాల విషయంలో కించిత్ బాధ అన్నది లేదు సరికదా.. తనను తాను సమర్థించుకున్న వైనం చూస్తే.. ఔరా అనుకోకుండా ఉండలేని పరిస్థితి. తనను బెదిరిస్తూ పోస్టు చేసిన వీడియోపై జర్నలిస్టు అశోక్ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీన్ని స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎదగాలని తపించేటోళ్లు.. ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే.. ఎదుగుతారా? అన్నది ప్రశ్న.

Tags
Madhapur police case Actor Chandrahas Tollywood Barabar Premistha Movie
Recent Comments
Leave a Comment

Related News

Latest News