వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై చేసిన దుర్భాషల అనంతరం.. టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బేషరతుగా చంద్రబాబుకు క్షమాపణలు చెప్పాలని కోరుతూ.. ఆయన ఇంటిని ముట్టడించారు. ఈ క్రమంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావు నేతృత్వంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.
ఈ క్రమంలో కొందరు కార్యకర్తలు దూకుడగా వ్యవహరించి.. అంబటి నివాసంపై దాడి చేశారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. కొందరు కార్యాలయానికి నిప్పు పెట్టారు. వాస్తవానికి ఆ సమయంలో వారిని నిలువరిం చేందుకు ఎమ్మెల్యే మాధవి ప్రయత్నించారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కానీ, కోపోద్రిక్తులైన కార్యక ర్తలు.. ఆవేశంలో వ్యవహరించారు. ఈ పరిణామాలపై అంబటి కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయిం చారు. తమకు భద్రత కల్పించాలని కోరారు.
ఈ నేపథ్యంలో హైకోర్టు స్పందించి.. అంబటి ఫ్యామిలీకి రక్షణ కల్పించాలని ఆదేశించింది. ప్రస్తుతం 15 మంది పోలీసులతో 24 గంటల పాటు.. నిరంతరం భద్రతకల్పి స్తున్నారు. ఇదిలావుంటే.. అంబటి నివాసంపై దాడి చేసిన వారిపైనా కేసులు పెట్టాలన్న హైకోర్టు ఆదేశాలతో గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఏ-1గా ఎమ్మెల్యే మాధవి, ఏ-2గా ఎమ్మెల్యే మాధవి భర్త గల్లా రామచంద్రరావును పేర్కొన్నారు. అదేసమయంలో ఇతర నేతలు.. 29 మందిపై మొత్తంగా 31 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఎమ్మెల్యే రియాక్షన్ ఇదీ..
తనపై కేసు నమోదు చేయడం పట్ల ఎమ్మెల్యే మాధవి ఆవేదన వ్యక్తం చేశారు. తాము కేవలం క్షమాపణలు మాత్రమే డిమాండ్ చేశామని.. అంబటి నివాసంపై దాడి చేయాలని తాము వెళ్లలేదన్నారు. ఈ విషయంలో కార్యకర్తలను కూడా నిలువరించామన్నారు. అంబటి చేసిన వ్యాఖ్యలను సభ్యసమాజం సహించేలా లేవని వ్యాఖ్యానించారు. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని చెప్పారు.