ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ తాజాగా ఫ్యామిలీతో కలిసి తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయానికి సమీపంలోని రాఘవేంద్ర మఠంలో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఫలితంగా శ్రీకాళహస్తి ఆలయ అర్చకుడు సస్పెన్షన్ కు గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గురువారం కుటుంబసభ్యులతో కలిసి శ్రీకాళహస్తి వెళ్లిన శ్రీకాంత్.. ముందు ఆలయాన్ని సందర్శించి స్వామి వారిని దర్శించుకున్నారు.
ఆపై ఆలయానికి సమీపంలోని రాఘవేంద్ర మఠంలో ప్రవేట్ గా నవగ్రహ శాంతి పూజలు చేయించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పనిచేసే ఓ అర్చకుడు, వేద పండితులు శ్రీకాంత్ ఫ్యామిలీ చేత పూజలు చేయించుకున్నారు. అనంతరం శ్రీకాంత్ కుటుంబం శ్రీ సోమస్కంద మూర్తి సమేత జ్ఞాన ప్రసూనాంబికాదేవి దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
అయితే శ్రీకాళహస్తి ఆలయ అర్చకులు ప్రైవేట్ గా ఎవరికీ ఇలాంటి పూజలు చేయకూడదనే నిబంధనలు ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే దేవాదాయ శాఖ చట్టం ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే శ్రీకాంత్ ఫ్యామిలీ చేత నవగ్రహ శాంతి పూజలు చేయించిన శ్రీకాళహస్తి ఆలయ అర్చకుడుపై వేటు పడింది. దేవస్థానం ఈవో బాపిరెడ్డి దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం 30/1987 ఉద్యోగి నియమ నిబంధనలు అతిక్రమించినందుకు అర్చకుడిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.