సినిమా ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) పేరు చెబితే.. అక్షరాల తూటాలతో పాటు ఆయన స్టైలిష్ గడ్డం కూడా ఇట్టే గుర్తుకొస్తుంది. దశాబ్దాలుగా ఒకే తరహా క్లాసీ లుక్లో కనిపిస్తున్న ఈ క్రియేటర్, అసలు క్లీన్ షేవ్ ఎందుకు చేసుకోరనే విషయంపై అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. రీసెంట్గా విక్టరీ వెంకటేష్తో కలిసి ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, ఈ మిస్టరీ వెనుక ఉన్న రియల్ అండ్ ఫన్నీ రీజన్ను బయటపెట్టారు.
ఈ చిట్చాట్ సందర్భంగా యాంకర్ సుమ(Anchor Suma) అడిగిన సరదా ప్రశ్నకు త్రివిక్రమ్ తనదైన సెన్సార్షిప్ లేని కామెడీ టైమింగ్తో అదిరిపోయే ఆన్సర్ ఇచ్చేశారు. పెళ్లయిన ప్రారంభ రోజుల్లో మినహా ఆ తర్వాత తాను ఎప్పుడూ గడ్డం తీయలేదని చెప్పారు. ఒకవేళ పొరపాటున ఇప్పుడు క్లీన్ షేవ్ చేసుకుని ఇంటికి వెళ్తే, కనీసం తన అర్ధాంగి కూడా తనను గుర్తుపట్టలేదని.. "అసలు మీరెవరు బాబు?" అంటూ ఇంటి తలుపులు కూడా వేసేస్తుందేమోనని భయమేస్తోందని నవ్వులు పూయించారు. ఆయన ఇచ్చిన ఈ స్పందనతో అక్కడున్నవారందరూ పడీపడీ నవ్వుకున్నారు.
ఇక అక్కడితో ఆగకుండా సుమ మరో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సంధిస్తూ.. ఆధార్ కార్డ్ లేదా పాస్పోర్ట్ వంటి అఫీషియల్ డాక్యుమెంట్లలో కూడా గడ్డంతోనే ఉన్న ఫోటోలు ఉంటాయా అని ప్రశ్నించారు సుమ. దానికి త్రివిక్రమ్((Trivikram) నవ్వుతూ బదులిస్తూ.. తన అధికారిక పత్రాలన్నింటిలోనూ ఇదే లుక్ కంటిన్యూ అవుతోందని చెప్పారు. ఒకవేళ ఇప్పడు గడ్డం తీసేసి ఎయిర్పోర్ట్కు వెళ్తే, ఇమిగ్రేషన్ అధికారులకు తాను గుర్తుపట్టలేక పెద్ద తికమక పరిస్థితులు తలెత్తే ఛాన్స్ ఉందని.. అందుకే ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ప్రశాంతంగా ఉండటానికే తాను ఈ స్టైల్కు కట్టుబడి ఉన్నానని చెప్పుకొచ్చారు.
కాగా, ప్రస్తుతం టాలీవుడ్(Tollywood)లో మోస్ట్ ఎవైటెడ్ కాంబినేషన్గా వస్తున్న త్రివిక్రమ్ - వెంకటేష్ ప్రాజెక్ట్ `ఆదర్శ కుటుంబం` ప్రమోషన్లలో భాగంగా ఈ కబుర్లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. సినిమాల్లోనే కాదు, రియల్ లైఫ్లోనూ తన మాటల తూటాలతో ఎలా నవ్విస్తారో ఈ ఇంటర్వ్యూ మరోసారి నిరూపించింది. ఆదర్శ కుటుంబం విషయానికి వస్తే.. అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నారా రోహిత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.