ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండే బెజవాడ పాలిటిక్స్ ఇప్పుడు మరోసారి హీటెక్కాయి. రాష్ట్ర నడిబొడ్డున ఉన్న విజయవాడ మేయర్ పీఠం కోసం కూటమి పార్టీల మధ్య తెరవెనుక జరుగుతున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయంతో అధికారంలోకి వచ్చిన టీడీపీ-జనసేన-భారతీయ జనతా పార్టీ కూటమికి, ఇప్పుడు స్థానిక సమరంలో ఈ మేయర్ సీటు పెద్ద పరీక్షగా మారింది. ఒకవైపు కూటమి ధర్మాన్ని పాటిస్తూనే, మరోవైపు తమ ప్రాబల్యాన్ని చాటుకోవడానికి రెండు ప్రధాన పార్టీలు వేస్తున్న అడుగులు ఆసక్తికరంగా మారాయి.
విజయవాడ(Vijayawada) రాజకీయాలపై ఇప్పటివరకు గట్టి పట్టున్న తెలుగుదేశం పార్టీలో మేయర్ సీటు రగడ తారాస్థాయికి చేరింది. పార్టీలోని సీనియర్ నేతలంతా ఈ పీఠంపై కన్నేయడంతో అధిష్టానానికి తలనొప్పిగా మారింది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తన రాజకీయ వారసుడిగా కుమారుడు సిద్ధార్థ్‌ను బరిలో దింపేందుకు పావులు కదుపుతుండగా, మరోవైపు దేవినేని కుటుంబం కూడా రేసులో నిలిచింది. ఇక విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సైతం తన సతీమణి గద్దె అనురాధ పేరును తెరపైకి తెచ్చారు. ఇలా ఒక్క పార్టీలోనే మూడు పవర్ఫుల్ ఫ్యామిలీలు పోటీ పడుతుండటంతో టీడీపీలో ఇంటర్గ్రల్ వార్ తారస్థాయికి చేరింది.
మరోవైపు, రాష్ట్ర రాజకీయాల్లో కీలక కేంద్రమైన విజయవాడలో ఇప్పటివరకు జనసేన(Janasena)కు బలమైన రాజకీయ అస్తిత్వం లేదనే చెప్పాలి. పొత్తుల కారణంగా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో జనసేనకు పెద్దగా అవకాశం దక్కలేదు. విజయవాడ వెస్ట్ సీటు బీజేపీ ఖాతాలోకి వెళ్లడంతో జనసేనకు అక్కడ నిరాశే మిగిలింది. అందుకే ఈసారైనా పట్టు నిలుపుకోవాలని, విజయవాడ మేయర్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని పవన్ కళ్యాణ్ గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. కూటమిలో భాగంగా తమ ఉనికిని చాటేందుకు జనసేన సైతం 'ఫ్రెండ్లీ ఫైట్' లేదా ప్రత్యేక వ్యూహానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో జనసేన తరఫున మేయర్ బరిలో నిలిచే ఆ అభ్యర్థి ఎవరనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రత్యక్ష ఎన్నికలు కావడంతో బలమైన రాజకీయ నేపథ్యం, ప్రజాబలం ఉన్న నేత అయితేనే గెలుపు సాధ్యమవుతుంది. ఇటీవల వంగవీటి రాధా జనసేనాని పవన్ కళ్యాణ్‌ను కలవడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. రాధా జనసేన నుంచి మేయర్ అభ్యరిస్తారనే ప్రచారం జోరుగా సాగుతున్నా, ఆయన మాత్రం తనకు పోటీ చేసే ఆసక్తి లేదని సన్నిహితుల వద్ద వాపోయినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి, విజయవాడ మేయర్ సీటు విషయంలో టీడీపీ(TDP)లోని సీనియర్ల పోరు ఒకెత్తైతే, కూటమిలో తమ వాటాను కోరుతున్న జనసేన వ్యూహాలు మరోకెత్తు. ఇరు పార్టీల మధ్య నడుస్తున్న ఈ ఆసక్తికర రాజకీయం ప్రత్యర్థి పార్టీలకు అస్త్రంగా మారుతుందా, లేక కూటమి పెద్దలు దీనికి ఎలాంటి తెరదించుతారనేది బెజవాడ పాలిటిక్స్‌లో ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.