టీటీడీ పరిధిలోని ఎస్ వీ గోశాలలో ఆవుల మరణాల వ్యవహారంపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. గత మూడు నెలలుగా దాదాపు 100 గోవులు మృత్యువాత పడ్డాయని, ఆ విషయాన్ని టీటీడీ, ప్రభుత్వం దాచిపెట్టాయని విమర్శలు గుప్పించారు. అయితేచ ఆ ప్రచారాన్ని నమ్మొద్దని, ఎక్కడో చనిపోయిన గోవుల ఫోటోలను టీటీడీ గోశాలకు చెందిన గోవులంటూ దుష్ప్రచారం చేస్తున్నారని టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వదంతులు నమ్మొద్దని, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేయొద్దని అధికారికంగా టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది.ఈ క్రమంలోనే వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి నారాయణ ఫైర్ అయ్యారు.కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని, మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని నారాయణ సంచలన ఆరోపణలు చేశారు. ప్రశాంతమైన తిరుమలలో అలజడి రేపేందుకు భూమన కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలాగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, టీటీడీ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.గోవుల సంరక్షణ కోసం టిటిడి గోశాలలో 260 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. గోవుల సంరక్షణను టీటీడీ పట్టించుకోవడంలేదని తప్పుడు ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. వైసీపీ హయాంతో పోలిస్తే ఎన్డీఏ కూటమి పాలనలో గోశాలలో అధునాతన సదుపాయాలు కల్పించి గోవులను సంరక్షిస్తున్నామని నారాయణ చెప్పారు.ఇక, మున్సిపాలిటీల్లో ఉదయం 6 గంటల కల్లా మున్సిపల్ కమిషనర్లు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని, క్షేత్రస్థాయిలో పర్యటించాలని మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు. తాను కూడా మున్సిపాలిటీలలో ఉదయమే పర్యటిస్తానని చెప్పారు. మున్సిపాలిటీలలో పారిశుధ్యం, తాగునీరుపై ప్రత్యేక దృష్టి సారించాలని నారాయణ సూచించారు. మున్సిపల్ కమిషనర్లు ఉదయం 6 గంటల నుంచి కచ్చితంగా క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలని ఆదేశించారు. ఒకవేళ అనారోగ్య కారణాలతో క్షేత్రస్థాయి పర్యటనలు చేయలేని అధికారులకు డైరెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు అప్పగిస్తామన్నారు. మెరుగైన పారిశుధ్యం కోసం అవసరమైన స్వీపింగ్ మెషీన్లు, ఇతర యంత్రాలను కొత్తగా కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. డ్రెయిన్ ల పూడిక తీత వెంటనే ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు.