జ‌గ‌న్ న‌యా ప్లాన్‌.. గ‌న్న‌వ‌రంలో వంశీ ప్లేస్ ను రీప్లేస్ చేసేది ఆమేనా?

admin
Published by Admin — February 15, 2025 in Politics, Andhra
News Image

ఓవైపు వైసీపీకి కీలక నాయకులంతా పెద్ద ఎత్తున గుడ్ బై చెబుతుంటే.. మరోవైపు అధినేత జ‌గ‌న్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇన్చార్జిలు యాక్టివ్ గా లేని చోట్ల కొత్త వారిని నియమిస్తున్నారు. ఇక తాజాగా గన్నవరం నియోజకవర్గం విషయంలో జగన్ నయా ప్లాన్ ను రెడీ చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వ‌ల్ల‌భ‌నేని వంశీ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో ఫిర్యాదుదారుడిని కిడ్నాప్ చేసి బెదిరించిన నేపథ్యంలో పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

ఇప్పట్లో వంశీ బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పైగా గత ఎన్నికల్లో ఓటమి తర్వాత వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నియోజకవర్గ ప్రజలకు కనిపించడమే మానేశారు. గన్నవరంలో వైసీపీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. నిజానికి గన్నవరం వైసీపీ ఇన్చార్జిగా గ‌తంలో యార్లగడ్డ వెంకట్రావు ఉండేవారు. అయితే వల్లభనేని వంశీ 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచి కొద్దిరోజులకే వైసీపీలోకి జంప్ అయ్యారు. దాంతో యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరి 2024 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసి వంశీని ఓడించారు.

అప్ప‌టినుంచి గన్నవరంలో వైసీపీ పరిస్థితి దారుణంగా మారింది. ఆ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం చాలా అధికం. ఈ నేపథ్యంలోనే అక్కడ బలమైన నేతను బరిలో దింపేందుకు జగన్ ప్రణాళికలు రచించారు. వైసీపీలో ప్రస్తుతం సీనియర్ నేతలు ఎవరూ లేరు. వల్లభనేని వంశీ సైతం పెద్దగా పట్టించుకోకపోవడం. తాజాగా అరెస్ట్ అవ్వడంతో వైసీపీకి ఇంచార్జ్ అవసరమయ్యారు.

ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ మహిళా నేత సుంకర పద్మశ్రీ పేరు తెర‌పైకి వ‌చ్చింది. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వచ్చిన పద్మశ్రీ.. పీసీసీ పీఠం ఆశించారు. కానీ వైఎస్ ష‌ర్మిలకి ఆ ప‌ద‌వి ద‌క్క‌డంతో.. సుంకర పద్మశ్రీ కొంతకాలం నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ప‌ద్మ‌శ్రీ‌ని వైసీపీలోకి ర‌ప్పించి గ‌న్న‌వ‌రం బాధ్య‌త‌ల‌ను ఆమెకు అప్ప‌గించాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. ఇప్ప‌టికే వైసీపీ పెద్ద‌లో ఆమెతో చ‌ర్చ‌లు కూడా జ‌రిపార‌ట‌. ఇక రేపో మాపో సుంకర పద్మశ్రీ వైసీపీలో చేరి గ‌న్న‌వ‌రంలో వంశీ ప్లేస్ ను రీప్లేస్ చేయ‌డం ఖాయ‌మ‌న్న టాక్ బ‌లంగా వినిపిస్తోంది.

Tags
Andhra Pradesh AP News ap politics
Recent Comments
Leave a Comment

Related News