వల్లభనేని వంశీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

admin
Published by Admin — February 14, 2025 in Politics, Andhra
News Image

వైసీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కి 14 రోజ‌లు రిమాండ్ విధిస్తూ.. న్యాయాధికారి శుక్ర వారం ఉద‌యం ఆదేశించారు. కుట్ర‌, కిడ్నాప్ కేసులో విజ‌య‌వాడ ప‌ట‌మ‌ట పోలీసులు గురువారం వంశీని హైద‌రాబాద్‌లో అదుపులోకి తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ కేసులో మ‌రికొంద‌రి పాత్ర‌పైనా నిగ్గు తేల్చుతున్నారు. అయితే.. వంశీతోపాటు.. ఆయ‌న అనుచ‌రులు లక్ష్మీపతి, కృష్ణప్రసాద్ ను కూడా.. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అనేక నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య గురువారం రాత్రం 11 గంట‌ల స‌య‌మంలో విజ‌య‌వాడ‌కు త‌ర‌లించారు.

ఈ క్ర‌మంలో పోలీసులు ఆ వెంట‌నే వంశీ స‌హా నిందితుల‌ను విజయవాడ స్థానిక కోర్టులో ప్ర‌వేశ పెట్టారు. గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని టీడీపీ కార్యాల‌యంపై దాడి కేసులో ఫిర్యాదు చేసిన స‌త్య‌వ‌ర్ధ‌న్‌ను బెదిరించి.. కిడ్నాప్ చేసి.. హెచ్చ‌రించార‌న్న‌ది వీరిపై ఉన్న ప్ర‌ధాన అభియోగం. వైసీపీ నాయ‌కుల‌పై పెట్టిన కేసుల‌ను వెనక్కి తీసుకునేలా స‌త్య‌వ‌ర్థ‌న్‌ను వ‌త్తిడి చేసి.. కోర్టు విచార‌ణ‌లో ఉన్న పిటిష‌న్‌ను వెన‌క్కి తీసుకునేలా చేశార‌ని పోలీసులు కేసు న‌మోదు చేశారు.

ఈ నేప‌థ్యంలోనే వంశీ స‌హా ఇత‌ర నిందితుల‌ను అరెస్టు చేశారు. ఈ క్ర‌మంలో గురువారం అర్ధ‌రాత్రి విజ‌య‌వాడ కోర్టులో వాద‌నలు జ‌రిగాయి. పోలీసుల‌ తరఫున వీరగంధం రాజేంద్ర ప్రసాద్‌, వంశీ తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 1.45 వరకు ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి. ఈ వాదనలు కొలిక్కి రాకపోవడంతో న్యాయమూర్తి అరగంటపాటు విశ్రాంతి తీసుకుని మ‌రోసారి వాదనలు విన్నారు. ఆఖ‌రుకు.. నిందితుల‌పై బ‌ల‌మైన ఆధారాలు ఉన్నాయ‌ని పేర్కొంటూ.. తెల్ల‌వారు జామున 5గంట‌ల స‌మ‌యంలో వంశీ స‌హా ముగ్గురికీ 14 రోజుల చొప్పున రిమాండ్‌ విధించారు.

దీంతో పోలీసులు వంశీ, లక్ష్మీపతి, కృష్ణప్రసాద్‌ల‌ను విజ‌య‌వాడలోని తాలూకా స‌బ్ జైలుకు త‌ర‌లించారు. ” వంశీకి నేర చరిత్ర ఉంది. అతనిపై ఇప్పటి వరకు 16 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. ఎన్టీఆర్‌ జిల్లా సీపీ ఆదేశాలతో 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. విశాఖ పోలీసుల సమాచారంతో విజయవాడ తీసుకొచ్చాం. ఈ కేసులో ఏ9గా ఉన్న రామును కలవాలని వంశీ బలవంతం చేశారు. సత్యవర్ధన్‌ ఫిర్యాదును వెనక్కి తీసుకోవడంలో ఏ7, ఏ8 కీలకంగా వ్యవహరించారు” అని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

Tags
14 days remand case on vallabhaneni vamsi Ex MLA Vallabhaneni Vamsi
Recent Comments
Leave a Comment

Related News