ఉద్యోగిపై టీటీడీ బోర్డు సభ్యుడు చిందులు!

admin
Published by Admin — February 19, 2025 in Politics
News Image

నిబంధనల్ని తూచా తప్పకుండా ఫాలో కావటమ చిన్నస్థాయి ఉద్యోగి చేసే తప్పు అవుతుందా? అదే నేరం అవుతుందా? ఆ మాత్రం దానికే నోరు పారేసుకోవటం.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడటంలో అర్థం లేదు. ఇలాంటి సీన్ తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద చోటు చేసుకుంది. నిత్యం గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన దానికి భిన్నంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు, బెంగళూరుకు చెందిన నరేష్ కుమార్ బూతుపురాణం సంచలనంగా మారింది. టీటీడీ ఉద్యోగిపై విరుచుకుపడ్డారు. స్వామివారి దర్శనం పూర్తి చేసుకొని బయటకు వచ్చే వేళలో.. మహాద్వారం నుంచి బయటకు పంపేందుకు అభ్యంతరం వ్యక్తం చేసిన వైనంపై విరుచుకుపడ్డారు.

హుందాగా వ్యవహరించాల్సింది పోయి.. అందుకు భిన్నంగా బూతులు తిట్టటం.. వారి స్థాయిని తక్కువ చేసి మాట్లాడటంతో పాటు.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడిన తీరును పలువురు తప్పు పడుతున్నారు. ఒకవేళ నిజంగానే ఉద్యోగి తప్పు చేస్తే.. ఆ విషయాన్ని అధికారులకు ఫిర్యాదు చేయాలే తప్పించి.. ఇష్టారాజ్యంగా ఉద్యోగులపై జులుం ప్రదర్శించటం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు.

ఇంతకూ అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే.. టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తమ వారితో కలిసి మహాద్వారం వద్దకు చేరుకున్నారు. బోర్డు సభ్యుడిగా ఉన్న తాను బయటకు వెళ్లేందుకు వీలుగా అక్కడున్న ఉద్యోగి బాలాజీతో.. మహాద్వారం వద్ద ఉన్నగేటును తీయాలని కోరారు. అయితే.. మహాద్వారం గేటు ద్వారా ఎవరినీ బయటకు పంపటం లేదని.. అభ్యంతరం ఉంటే ఉన్నతాధికారుల్ని సంప్రదించాలని కోరారు.

దీంతో.. అహం దెబ్బతిన్న ఆయన నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం మొదలు పెట్టారు. థర్డ్ క్లాస్ నా.. అంటూ బూతుపురాణం అందుకున్నారు. కొందరు ఉద్యోగులు తమ స్థాయికి కూడా గౌరవం ఇవ్వట్లేదని.. దురుసుగా ప్రవర్తిస్తున్నట్లుగా మండిపడ్డారు. ఈ పంచాయితీ జరుగుతున్న సమయంలో టీటీడీ వీజీవో సురేంద్ర.. పోటు ఏఈవో మునిరత్నం అక్కడకు చేరుకొని.. సదరు ఉద్యోగిని పక్కకు పంపి.. మహాద్వారం నుంచి బయటకు పంపటంతో వివాదం ఒక కొలిక్కి వచ్చింది. అయితే.. టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ కుమార్ అనుచిత వైఖరిని పలువురు తప్పు పడుతున్నారు.

ఇదిలా ఉంటే.. అసలు రూల్ పొజిషన్ ఏం చెబుతోంది? ఈ ఇష్యూలో బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ కోరినట్లుగా మహాద్వారం వద్ద ఉన్న గేటును తీయాల్సిన అవసరం ఉందా? లేదా? అన్నది ప్రశ్నగా మారింది.దీనిపై నిబంధనల్ని.. దేవాలయం వద్ద అనుసరించే పద్దతుల్ని చూసినప్పుడు.. సదరు ఉద్యోగి నిబంధనలకు ప్రకారమే పని చేశారని చెబుతున్నారు. వీఐపీలు బయటకు వచ్చే వేళలో మహాద్వారం.. గొల్లమండపం వద్ద తీవ్ర రద్దీ ఏర్పడుతోంది. దీంతో.. బయటకు వచ్చే వారంతా బయోమెట్రిక్ వైపుగానే రావాలన్న నిబంధనను కొంతకాలంగా అమలు చేస్తున్నారు.

ఉద్యోగి భుజం పై చేయి వేసి నెట్టటం.. బూతులు తిట్టటం.. ఉద్యోగుల మనోభావాలు దెబ్బ తీనేలా వ్యవహరించటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఒకవేళ ఉద్యోగి తప్పు చేసి ఉంటే.. ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు ఇచ్చి ఉంటే సరిపోయేదని.. అందుకు భిన్నంగా నోరు పారేసుకున్న వైఖరి ఏ మాత్రం సరికాదంటున్నారు. ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో ఈ తరహా వైఖరిని భక్తులు పెద్ద ఎత్తున తప్పు పడుతున్నారు.

Recent Comments
Leave a Comment

Related News