ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కారణంగా.. అనేక పెట్టుబడులు వస్తు న్నాయని.. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(central it minister aswini vaishnav) పేర్కొన్నారు. కేవలం ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాకుండా.. వాటిని గ్రౌండ్ అయ్యేలా సీఎం చంద్రబాబు(cm chandrababu) ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఈక్రమంలో త్వరలోనే ఏపీ రాజధాని అమరావతి, తెలంగాణ రాజధాని హైదరాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి రానుందని తెలిపారు.
ఈ రైలు అందుబాటులోకి వస్తే.. అమరావతి నుంచి హైదరాబాద్‌కు కేవలం గంటా 10 నిమిషాల్లోనే చేరుకోవచ్చన్నారు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి అమరావతికి కూడా అంతే సమయంలో రావొచ్చన్నారు. అద్భుతమైన నగరంగా అమరావతిని రూపుదిద్దుతున్నారని తెలిపారు. ప్రపంచ స్థాయి నగరంగా భారత దేశంలోనే అమరావతికి ప్రత్యేక స్థానం ఏర్పడుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలోని హైదరాబాద్ నుంచి అమరావతికి సాధ్యమైనంత వేగంగా బుల్లెట్ రైలును నడపాలని నిర్ణయించామన్నారు. దీనికి సంబంధించిన భూసేకరణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయన్నారు.
అలాగే.. చెన్నై నుంచి అమరావతి(amaravati) మధ్య కేవలం రెండు గంటల్లోనే ప్రయాణించేలా.. మరో బుల్లెట్ రైలును అందుబాటులోకి తీసుకురానున్నట్టు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇది కూడా సీఎం చంద్రబాబు ఆలోచన మేరకు రూపుదిద్దుకుంటున్న ప్రాజెక్టుగా ఆయన పేర్కొన్నారు. అలాగే.. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు కూడా మరో బుల్లెట్ రైలు మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నామని.. తద్వారా 2 గంటల్లోనే ఇరు ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించేందుకు వీలుంటుందని పేర్కొన్నారు.
గూగుల్ రావడం.. అదృష్టం!
విశాఖపట్నానికి గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థ రావడం గొప్ప అదృష్టమని కేంద్ర మంత్రి తెలిపారు. అనేక రాష్ట్రాలు పోటీ పడినప్పటికీ.. సీఎం చంద్రబాబు విజన్.. ఆయన ఇచ్చిన భరోసా.. ప్రభుత్వ సహకా రం.. ఈజ్ ఆఫ్ డూయింగ్ వంటి అంశాల కారణంగానే గూగుల్ వచ్చిందన్నారు. దీని ద్వారా స్థానిక యువతకు భారీ ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఇక, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు. అన్ని రంగాల్లోనూ ఏపీ విస్తరించేందుకు అవకాశం మెండుగా ఉందని తెలిపారు.