త్యాగానికి ద‌క్కిన గౌర‌వం.. నాగ‌బాబుకు స‌ర్కార్ కీల‌క బాధ్య‌త‌లు..!

admin
Published by Admin — January 29, 2026 in Politics, Andhra
News Image

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన ముఖ్య నేత, మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు పాత్ర ఎప్పుడూ ప్రత్యేకం. పార్టీ ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్ వెన్నంటే ఉంటూ, తెర వెనుక వ్యూహకర్తగా వ్యవహరించిన ఆయనకు కూటమి ప్రభుత్వం ఇప్పుడు కీలకమైన బాధ్యతలను అప్పగించింది. శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గ అభివృద్ధి పర్యవేక్షణ బాధ్యతలను నాగబాబుకు అప్పగిస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడంతో ఉత్తరాంధ్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

గత ఎన్నికల సమయంలో నాగబాబు త్యాగం గురించి కూటమి శ్రేణుల్లో పెద్ద చర్చే జరిగింది. తొలుత అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయాలని భావించినప్పటికీ, పొత్తు ధర్మంలో భాగంగా ఆ సీటును బీజేపీకి వదులుకోవాల్సి వచ్చింది. తమ్ముడు పవన్ కళ్యాణ్ లక్ష్యం కోసం, కూటమి విజయం కోసం తన వ్యక్తిగత రాజకీయ ఆకాంక్షలను పక్కన పెట్టి నాగబాబు వెనకడుగు వేశారు. ఆయన త్యాగాన్ని గుర్తించిన ప్రభుత్వం, తొలుత ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించగా.. ఇప్పుడు ఎచ్చెర్ల రూపంలో ఒక పటిష్టమైన రాజకీయ వేదికను సిద్ధం చేసింది.

సాధారణంగా ఎమ్మెల్సీలకు తమకు నచ్చిన నియోజకవర్గాన్ని ఎంచుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ, నాగబాబు ఎచ్చెర్లను ఎంచుకోవడం వెనుక పక్కా రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో కీలకమైన ఈ నియోజకవర్గంలో పట్టు సాధించడం ద్వారా, ఉత్తరాంధ్రలో జనసేన క్యాడర్‌ను మరింత బలోపేతం చేయాలని ఆయన భావిస్తున్నారు. తాజా జీవో ప్రకారం.. ఎచ్చెర్లలో జరిగే ప్రతి ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలోనూ నాగబాబుకు ప్రత్యేక ప్రోటోకాల్ లభిస్తుంది. అంటే, ఇకపై ఆ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల నుంచి పాలనాపరమైన నిర్ణయాల వరకు నాగబాబు ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది.

ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కేవలం అభివృద్ధి పర్యవేక్షణకే పరిమితం కాదని, ఇది రాబోయే ఎన్నికల కోసం ఒక బలమైన పునాది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నియోజకవర్గ ప్రజలతో మమేకమవ్వడానికి, స్థానిక సమస్యలను నేరుగా పరిష్కరించడానికి నాగబాబుకు ఇది ఒక గోల్డెన్ ఛాన్స్. ఎచ్చెర్లలో ఆయన చూపే పనితీరు, వచ్చే ఎన్నికల్లో ఆయనను అక్కడి నుండే అసెంబ్లీ బరిలోకి దింపేలా కూటమి అడుగులు వేస్తోంద‌ని ఇన్‌సైడ్ టాక్‌.

Tags
Nagababu Pawan Kalyan JanaSena AP Politics Etcherla Andhra Pradesh
Recent Comments
Leave a Comment

Related News