మహారాష్ట్ర: మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. ఎన్నో రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొని 'కింగ్ మేకర్'గా ఎదిగిన ఎన్సీపీ అధినేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో కన్నుమూశారు. బారామతి గడ్డపై అడుగుపెట్టి తన పట్టు నిలుపుకోవాలని భావించిన ఆ నేతకు, ఆ గమ్యస్థానమే ఆఖరి ప్రయాణం అవుతుందని ఎవరూ ఊహించలేదు. అయితే ఈ ప్రమాదంలో అందరినీ విస్మయానికి గురిచేస్తున్న అంశం ఏమిటంటే.. గతంలో ఆయనను త్రుటిలో తప్పించిన అదే విమానం, నేడు ఆయన ప్రాణాలను బలితీసుకోవడం.
నీడలా వెంటాడిన మృత్యువు..!
సరిగ్గా రెండేళ్ల క్రితం, 2023 సెప్టెంబర్ 14న అజిత్ పవార్ ఒక పెను ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడ్డారు. నాడు విశాఖపట్నం నుండి ముంబై వస్తుండగా, భారీ వర్షం కారణంగా ఆయన ప్రయాణిస్తున్న ప్రైవేట్ జెట్ రన్‌వేపై స్కిడ్ అయి రెండు ముక్కలైంది. అప్పుడు ఆయన ప్రయాణించింది వీఎస్ఆర్ ఏవియేషన్ కంపెనీకి చెందిన ఇదే లియర్ జెట్ విమానంలో. ఆనాడు అదృష్టం కొద్దీ ప్రాణాపాయం తప్పింది. కానీ నేడు అదే విమానంలో ప్రయాణించి మృత్యువొడిలోకి చేరుకోవడం యాదృచ్ఛికమో లేక విధి విలయమో అర్థం కాక అందరూ షాకవుతున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ఉదయం 8 గంటలకు ముంబై నుంచి అజిత్ పవార్ బయలుదేరారు. మరో 10 నిమిషాల్లో బారామతి ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవ్వాల్సి ఉండగా, విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు సమాచారం. పైలట్లు విమానాన్ని నియంత్రించే లోపే అది వేగంగా కిందికి వచ్చి కుప్పకూలింది. మంటలు అంటుకోవడంతో విమానంలో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించినట్లు డీజీసీఏ ధ్రువీకరించింది. భద్రతా సిబ్బంది, పైలట్లు మరియు అజిత్ పవార్ రూపంలో మహారాష్ట్ర ఒకేసారి ఐదుగురు పౌరులను కోల్పోయింది. అయితే అదే కంపెనీ.. అదే విమానం ఇప్పుడు అజిత్ పవార్ పాలిట డెత్ వారెంట్‌గా మారడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విమాన నిర్వహణలో లోపాలున్నాయా? లేక వాతావరణం అనుకూలించలేదా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.