ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్‌పై ఒక ప్రభుత్వ ఉద్యోగిని చేసిన లైంగిక ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తనను ఏడాదిన్నర కాలంగా లైంగికంగా వాడుకున్నారని సదరు మహిళ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసింది.
ఎమ్మెల్యే తనను పెళ్లి పేరుతో నమ్మించి లోబరుచుకున్నారని, ఈ క్రమంలో తాను గర్భం దాల్చగా ఐదుసార్లు బలవంతంగా అబార్షన్లు చేయించారని ఆమె ఆరోపించారు. ఇప్పుడు నిలదీస్తుంటే తనను, తన కుమారుడిని చంపేస్తామని బెదిరిస్తున్నారని సదరు ప్రభుత్వ ఉద్యోగిని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె వదిలిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఎమ్మెల్యే వెర్షన్ మరోలా..!
ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కూడా అంతే వేగంగా స్పందించారు. తనపై వస్తున్నవన్నీ నిరాధారమైన ఆరోపణలని ఆయన కొట్టిపారేశారు. ``నా రాజకీయ జీవితాన్ని దెబ్బతీయడానికి ప్రత్యర్థులు పన్నిన కుట్ర ఇది. నా నిబద్ధతను ప్రజలు నమ్ముతారు`` అని ఆయన ఒక వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. మరోవైపు, ఎమ్మెల్యే తల్లి ప్రమీల కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. సదరు మహిళ తమను బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తోందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ బాధితురాలితో మాట్లాడి వివరాలు సేకరించారు. సమగ్ర విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం కోడూరు పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి, ఇరుపక్షాల వాదనలను విచారిస్తున్నారు. జనసేన పార్టీ అధిష్టానం కూడా ఈ ఘటనపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.