ప్రజా సమస్యలు తెలుసుకోవడంలో టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ రూటే సెపరేటు. గతంలో పెనమలూరు నియోజకవర్గంలో ఒంటరిగా పర్యటించిన ఆయన అందరికీ షాకిచ్చారు. నో పోలీస్ .... నో పార్టీ.... ఓన్లీ పబ్లిక్ అంటూ బుల్లెట్ బండి వేసుకొని ఒక్కరే గ్రామాలకు వెళ్లారు. కంకిపాడులో బుల్లెట్‌పై పర్యటించి ప్రజా సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అదే మాదిరిగా తాజాగా స్విగ్గీ డెలివరీ బాయ్ అవతారమెత్తి ప్రజలతో నేరుగా కనెక్ట్ కావడంతో పాటు డెలివరీ బాయ్స్ కష్టాలను కూడా స్వయంగా తెలుసుకున్న వైనం ఆయనను సోషల్ మీడియాలో మరింత పాపులర్ చేసింది.
కష్టాలు తెలుసుకోవటానికి సదరు కష్టం చేయాల్సిందేనా? లేకపోతే అవగాహన రాదా? అనే ప్రశ్నకు ఎవరికి తోచింది వారు చెబుతుంటారు. అంతకంతకూ పెరుగుతున్న గిగ్ వర్కర్లకు బోలెడన్ని సమస్యలు ఉన్నప్పటికీ.. వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు మరెంతో చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గిగ్ వర్కర్లలో ఒకరైన డెలివరీ బాయిస్ కష్టాలు తెలుసుకోవటానికి బోడే ప్రసాద్ వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.
అదే సమయంలో గిగ్ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం డెలివరీలు చేస్తేనే.. వారి సమస్యలు తెలుస్తాయా? లేకుంటే తెలీవా? అన్నది మరో ప్రశ్న వినిపిస్తోంది. ఈ భిన్నాభిప్రాయాల్ని పక్కన పెడితే.. డెలివరీ బాయిస్ కష్టాల్ని తెలుసుకునే ప్రయత్నం చేసిన బోడే ప్రసాద్...రెండు. మూడు డెలివరీలు తానే స్వయంగా ఇవ్వటం మరో విశేషం. 2 వారాల క్రితం ఒక ఇంటికి వెళ్లి.. వారిచ్చిన ఆర్డర్ పార్శిల్ ను వారికి అందించారు. ఆ డెలివరీ బాయ్ ఎమ్మెల్యే అని తెలుసుకున్న వారు విస్మయానికి గురయ్యారు.
ఇదే విధంగా కానూరు.. పోరంకి.. యనమలకుదురులలో ఇదే విధంగా డెలివరీలు చేయటం గమనార్హం. అయితే, ఇందుకు సంబంధించిన వీడియోను బోడే ప్రసాద్ తన ఫేస్ బుక్ పేజీలో లేటుగా షేర్ చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదంతా ఎందుకు? అన్నది హాట్ టాపిక్ గా మారింది. గిగ్ వర్కర్ల కష్టాలు తెలుసుకోవటానికి తానే స్వయంగా డెలివరీ బాయ్ గా వ్యవహరించానని.. దీంతో వారి కష్టాలు.. పని ఒత్తిడి తనకు అర్థమైందని చెప్పారు. డెలివరీ బాయిస్ కు ప్రజలు తగిన గౌరవం ఇవ్వాలని ఆయన కోరటం గమనార్హం.